ప్రలోభాల పర్వం
చెన్నూర్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): చెన్నూర్ నియోజకవర్గంలోని భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సర్పంచ్ అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెర తీశారు. కుల, ప్రజా, యువజన సంఘాలతోపాటు యువతకు మందు, విందులు ఏర్పాటు చేస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాల్లో పోటీ తీవ్రంగా ఉండడంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మహిళలకు డబ్బులు, శీతలపానీయాలు, చీరలు, కానుకలు, పురుషులకు మద్యం పంపిణీ చేస్తున్నారు. కోటపల్లి మండలం సిర్సా, పుల్లగామ, జనగామ, నక్కలపల్లి, కోటపల్లి, చెన్నూర్ మండలం కిష్టంపేట, సుద్దాల, అంగ్రాజుపల్లి, సోమన్‌పల్లి, దుగ్నెపల్లి, చెల్లాయిపేట, వెంకంపేట, కత్తరశాలలో ఓటర్లకు సకల మర్యాదలు చేస్తున్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రవాణా చార్జీలతోపాటు మర్యాదలకు సన్నాహాలు చేస్తున్నారు.
నాలుగు స్థానాలు ఏకగ్రీవం
మొత్తం 102 సర్పంచ్, 153 వార్డు సభ్యుల స్థానా లు ఏకగ్రీవం అయ్యాయి. చెన్నూర్ మండలం రచ్చపల్లి, కోటపల్లి మండలం ఎసాన్‌వాయి, లక్ష్మిపూర్, మందమర్రి మండలం శంకర్‌పల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయా గ్రామాల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో ఫలితాలు రాత్రి వరకు వెల్ల డయ్యే అవకాశం ఉంది.
మండలాల వారీగా సామగ్రి పంపిణీ కేంద్రాలు
17న పోలింగ్ దృష్ట్యా ఐదు మండలాల్లో పోలింగ్ సిబ్బంది, పోలీసు, వెబ్‌కాస్టింగ్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం ఆయా మండల కేంద్రాల్లో సామగ్రి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్లడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం సందర్శించారు.
999పీవోలు,
1,092మంది ఓపీవోలు
ఎన్నికల విధుల్లో 999మంది ప్రిపైడింగ్ అధికారులు(పీవో), 1,092మంది ఇతర పోలింగ్ అధికారులు(ఓపీవో) పాల్గొననున్నారు. 99మంది స్టేజ్–2 ఆర్‌వోలతోపాటు ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు, 18మంది వెబ్‌కాస్టింగ్ సిబ్బంది భాగస్వామ్యం కానున్నారు. సిబ్బంది, పోలింగ్ సామగ్రి తరలింపునకు 59బస్సులు, 19కార్లు, 9టాటాఏస్ వాహనాలను డీటీవో గోపికృష్ణ పర్యవేక్షణలో ఎంవీఐ సంతోష్‌కుమార్ ఏర్పాటు చేశారు.
మండలాల వారీగా ఓటర్ల వివరాలు
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
భీమారం 6,394 6,699 0 13,093
చెన్నూర్ 12,839 13,263 0 26,102
జైపూర్ 15,278 15,347 1 30,626
కోటపల్లి 12,797 13,142 2 25,941
మందమర్రి 5,502 5,624 1 11,127
మొత్తం 52,810 54,075 4 1,06,889


