తవ్వకాల్లో బయటపడిన దుర్గాదేవి విగ్రహం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల పుష్కరఘాట్ రహదారిలో దుర్గాదేవి విగ్రహం బయటపడింది. ఇటీవల అయోధ్య రామమందిరంలోని ఓ ప్రధాన పూజారితోపాటు వారణాసి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు పీఠాధిపతులు, స్వాములు పుష్కరఘాట్ వద్ద గోదావరినదికి హారతి ఇచ్చేందుకు వచ్చి దుర్గాదేవి విగ్రహం ఉందని జోస్యం చెప్పడం, పూజలు చేయడం తెలిసిందే. సోమవారం ముల్కల్ల గాయత్రి, శారదాపీఠం పీఠాధిపతి, స్థానిక వేద పండితుల ఆధ్వర్యంలో పుష్కరఘాట్‌లోని నాడెం వెంకటయ్యకు చెందిన స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టారు. బేసీబీతో తవ్వకాలు చేపట్టగా సింహవాహనంపై ఉన్న దుర్గాదేవి విగ్రహం బయటపడింది. గోదావరి జలాలతో జలాధివాసం చేసి వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్టించారు. విషయం తెలియడంతో పరిసర ప్రాంత భక్తులు భారీగా తరలివచ్చి స్వయంభూగా వెలిసిన దుర్గాదేవి విగ్రహాన్ని దర్శించుకున్నారు. హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్‌కిరణ్, అయ్యప్పస్వామి భక్తులు, ముల్కల్ల శ్రీగాయత్రి, శ్రీశారదా పీఠం పీఠాధిపతి చంద్రమౌళ్యాచార్యులు, స్థానిక వేద పండితుల పవనశాస్త్రి పాల్గొన్నారు. త్వరలో దేవాలయ నిర్మాణం చేపట్టి భారీ ఎత్తున విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహిస్తామని విజయదుర్గా సేవా సమితి సభ్యులు తెలిపారు.
తవ్వకాల్లో బయటపడిన దుర్గాదేవి విగ్రహం


