విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చూడాలి
కోటపల్లి: ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అసౌకర్యాలు కలుగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కోటపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. తాగునీరు, మూత్రశాలలు, వంటశాలలు, అందిస్తున్న భోజనం నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు. రిజిష్టర్లు తనిఖీ చేశారు. మోనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అనంతరం కోటపల్లి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.


