పట్టు కోసం ప్రతిపక్షాలు
మంత్రి వివేక్ ఇలాకాలో పంచాయతీ ఎన్నికలు
గత వైభవం కోసం బీఆర్‌ఎస్ ఆరాటం
పట్టు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నం
ఆసక్తికరంగా మూడో విడత ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రెండు విడతల్లో పోలింగ్, ఫలితాల వెల్ల డి పూర్తి కాగా.. బుధవారం చెన్నూర్ నియోజకవర్గంలో తుది దశ ఎన్నికలు జరగనున్నాయి. అధికా ర, ప్రతిపక్ష పార్టీల నాయకులతోపాటు స్వతంత్రులూ రంగంలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఫలితాలపై అంచనాలు పెరిగాయి. ఇక బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రతిపక్ష ‘గులాబీ’ పార్టీ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇంకోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ చెన్నూర్ నియోజకవర్గానికే చెందిన వారు కావడంతో ‘కమలం’ పార్టీ తన పరిధి విస్తృతం చేసుకోవాలని, పలు చోట్ల గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. వీలైనన్ని సర్పంచ్, వార్డు స్థానాలు తమ మద్దతుదారులే ఎన్నికయ్యేలా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు.
వర్గ పోరు, రెబెల్స్ బెడద
అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రామాల్లో రెండేసి వర్గాలుగా ఉన్నాయి. పాత, కొత్త నాయకుల మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని ఆయా గ్రామాల్లో గత కొన్నేళ్లుగా సీనియర్ నాయకుల చేతిలోనే అంతా నడుస్తోంది. మంత్రి వివేక్ మాట వినకుండా కొందరు సర్పంచ్ బరిలో ఉన్నారు. దీంతో సొంత పార్టీలోనే ఎన్నికల్లో వ్యతిరేక వర్గంతో పోటీ నెలకొంది. కొన్ని గ్రామాల్లో నాయకుల మధ్య ఎన్నికల వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలో తన నియోజకవర్గంలో పట్టు నిరూపించుకునేందుకు మంత్రి వివేక్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ మద్దతుదారులను అభ్యర్థుల ఎంపిక నుంచి సొంత పార్టీలో ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల ఇన్‌చార్జి లను నియమించి అధిక స్థానాలు గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పల్లెల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆరాట పడుతోంది. నియోజకవర్గంలో గత వైభవం కోసం చెమటోడుస్తోంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత కేడర్‌లో నిరాశ నెలకొంది. ఇప్పటికీ కొన్ని చోట్ల పార్టీ బలం ఉండడంతో మళ్లీ పుంజుకుంటామనే ఆశతో పోటీలో ఉన్నారు. సర్పంచ్ స్థానాలు గెలిచేందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రంగంలోకి దిగారు. కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేస్తూ తమ మద్దతుదారులు గెలిచేలా కృసి చేస్తున్నారు. ఇక బీజేపీ వచ్చే అసెంబ్లీ నాటికి చెన్నూర్‌లో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో పలు చోట్ల కమలం పార్టీ మద్దతుదారులు గెలుస్తారనే భరోసాతో ఉన్నారు. పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ స్థానాలు గెలిచేందుకు కృషి చేస్తున్నారు.


