మిర్చికి తెగుళ్లు.. రైతుకు కన్నీళ్లు
చెన్నూర్: ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏటా మిర్చి రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. ఈ ఏడాదైనా పంట బాగా పండితే నష్టాలను పూడ్చుకోవచ్చని ఆశిస్తే నిరాశే ఎదురైంది. నెల రోజుల్లో పంట చేతికి రానుండగా ఈ సమయంలో తెగుళ్లు సోకాయి. కళ్లెదుటే పంటంతా నాశనం అవుతుండడంతో రైతులు తల పట్టుకుంటున్నారు. గతేడాది చెడగొట్టు వానలు నట్టేట ముంచితే ఈ సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు మిర్చి రైతులను కంటి మీద కునుకులేకుండా చేశాయి. పంట వేసిన నుంచి దిగుబడి చేతికి వచ్చేదాకా క్రిమిసంహారకాలు పిచికారీ చేసినా ఫలితం లేకుండాపోయింది. తెగుళ్లు తగ్గక పోగా కొత్త తెగుళ్లు దాపురించాయి. ఈ కారణంగా చెట్లు ముడతపడి ఎండిపోవడమే కాకుండా మిర్చి నల్లగా మారుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు వివిధ రకాల పురుగు మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది.
తగ్గనున్న దిగుబడి
వర్షాభావ పరిస్థితులు, వాతావరణంలో వచ్చిన మార్పులతో మిర్చి పంటకు ఎర్రనల్లి, తెల్లదోమ, బబ్బెర ముడత, జెమిని తెగుళ్లు సోకాయి. తెగుళ్ల బారిన పడకుంటే ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈ ఏడాది పంట వేసిన నుంచి తెగుళ్లు సోకుతుండగా ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి వాణిజ్య పంట కావడంతో దిగుబడి చేతికి వచ్చేదాకా ఎకరాకు రూ.1.80లక్షల నుంచి రూ.2లక్షల వరకు పెట్టుబడి అవుతోందని వారు చెబుతున్నారు. 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే గిట్టుబాటు అవుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం 7 నుంచి 8 క్వింటాళ్లు మాత్రమే వచ్చే అవకాశముండగా ఎకరాకు రూ.50వేల నుంచి రూ.80వేలు నష్టం వాటిల్ల వచ్చని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో తగ్గిన సాగు
గతేడాది మిర్చికి ధర లేక ఈ సంవత్సరం జిల్లాలో సాగు గణనీయంగా తగ్గింది. పోయినేడాది జిల్లాలో 1,046 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 250 ఎకరాలకే పరిమితమైంది. మిర్చి పంటకు పేరున్న కోటపల్లి మండలంలోనే అత్యధికంగా రైతులు సాగు చేశారు. గతేడాది క్వింటాల్ ధర రూ.14వేలు పలికింది. ఈ ఏడాది ధర పెరుగుతుందని రైతులు ఆశించారు. ప్రస్తుతం వరంగల్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.13,500 ధర పలుకుతోంది. ధర కూడా గతేడాది కంటే తక్కువగా ఉండడంతో నష్టాలు తప్పేలా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)
క్లస్టర్ గతేడాది ప్రస్తుతం
మంచిర్యాల 112 42
బెల్లంపల్లి 124 38
చెన్నూర్ 810 170
మొత్తం 1,046 250
మిర్చికి తెగుళ్లు.. రైతుకు కన్నీళ్లు


