● నగరంలో పైపులైన్ల లీకేజీలు ● ప్రజలకు అందని శుద్ధమైన నీ
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో పైపులైన్ల లీకేజీల కారణంగా తాగునీరు కలుషితం అవుతోంది. తరచూ ఏదో ఒక ప్రాంతంలో పైపులు పగిలి తాగునీరు వృథాగా పోతోంది. ఆ ప్రాంతంలో నీరు మురుగుగా మారి అదే పైపుల ద్వారా సరఫరా అవుతోంది. శుద్ధమైన తాగునీటిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టి రూ.కోట్లు కేటాయిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. డ్రెయినేజీలు సక్రమంగా లేకపోవడం, డ్రెయినేజీల్లో నుంచి వెళ్లే పైపులు లీకేజీ ఏర్పడి నీరు కలుషితం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. లీకేజీలకు మరమ్మతులు చేపడుతున్నా ఏదో ఒక ప్రాంతంలో సమస్య ఏర్పడుతోంది. మంచిర్యాల మున్సిపాల్టీగా ఉండగా 16ఏళ్ల క్రితం ముల్కల్ల గోదావరి వద్ద ఫిల్టర్‌బెడ్ నిర్మించి తాగునీరు సరఫరా చేస్తున్నారు. అప్పుడే రూ.29.30కోట్లతో మంచినీటి ఫిల్టర్‌బెడ్ నిర్మించి పైపులైను వేశారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ముల్కల్ల ఫిల్టర్‌బెడ్‌కు తరలించి మంచిర్యాలకు సరఫరా చేస్తున్నారు. దశాబ్దాన్నర క్రితం వేసిన పైపులైన్‌కు తరచూ లీకేజీ సమస్యలు వస్తుండడంతో గత ఏడాది అమృత్ 2.0 పథకం కింద మంచిర్యాల మున్సిపాల్టీకి రూ.48.50 కోట్లు, నస్పూర్ మున్సిపాల్టీకి రూ.73 కోట్లు కేటాయించారు. మంచిర్యాలలో కొత్తగా 6,100 నల్లా కనెక్షన్లు, 21 కిలోమీటర్ల పైప్‌లైన్ మార్పు, వాటర్ ట్యాంక్ నిర్మించాలి. నస్పూరులో ఐదు వేల నల్లా కనెక్షన్లు, 18 కిలోమీటర్ల పైప్‌లైన్, ఏడు వాటర్ ట్యాంకులు, వాటర్ ఫిల్టర్‌బెడ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఏడాది క్రితం పనులు ప్రారంభించినా మంచిర్యాల, నస్పూరులో 40శాతం మాత్రమే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జూన్‌లోపు పూర్తిచేయాల్సి ఉండగా ఆలస్యం ఆవుతున్నాయి. నగరంలో 76మంది తాగునీటి సరఫరా కోసం పని చేస్తుండగా, పూర్తిస్థాయిలో సిబ్బంది లేక లీకేజీ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. అమృత్ 2.0 పథకం ద్వారా పాతపైపులను మార్చితేనే లీకేజీలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితమే పాత పైపుల స్థానంలో కొత్తవి వేసేందుకు ఆయా ప్రాంతాల్లో పైపులను తెప్పించి ఉంచినా పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
‘అమృత్’ ఆలస్యం.. తాగునీరు కలుషితం
మంచిర్యాల కార్పొరేషన్ వివరాలు
జనాభా 2,48,283
నల్లా కనెక్షన్లు 42,564
పైపులైన్ 566 కిలోమీటర్లు
● నగరంలో పైపులైన్ల లీకేజీలు ● ప్రజలకు అందని శుద్ధమైన నీ


