ఆరట్టు వైభవం
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీఅభినవ శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆదివారం ఆరట్టు వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపకుడు, గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు జల క్రీడ, పంచామృతాభిషేక పూజలు, పుష్పాభిషేకం, మూల విరాట్టుకు అభిషేక పూజలు నిర్వహించారు. ఆరట్టులో భాగంగా ఆలయ సమీపంలో మరో గుట్టపై అయ్యప్ప భక్తులు వల్లీవేట కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల శరణుఘోషతో గూడెం అయ్యప్ప ఆలయ ప్రాంగణం మార్మోగింది. అయ్యప్ప కీర్తనలతో నిర్వహించిన ప్రత్యేక భజన కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి కూడా దీక్షాపరులు, భక్తులు అధికసంఖ్యలో వచ్చారు.
ఉత్సవ విగ్రహానికి అభిషేక పూజలు చేస్తున్న అర్చకులు


