మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య
కడెం: అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికిరణ్, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ లక్కవత్తుల రాజనర్సింహం(రాజు) (42)కు 12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరగడంతో చికిత్స చేయించారు. ఇటీవలే రెండు కాళ్లకూ ఇన్‌ఫెక్షన్ కావడంతో తొలగించాలని వైద్యులు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన రాజు ఆదివారం గ్రామంలోని చింతచెట్టుకు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


