ఆర్‌ఆర్ జట్టులో మన ఆర్తి
ఆసిఫాబాద్‌రూరల్: ఫుట్‌బాల్ క్రీడాకారుడు ల యోనల్ మెస్సీ కిక్‌లతో హైదరాబాద్‌లోని ఉప్ప ల్ స్టేడియం ఉర్రూతలూగింది. అభిమానుల ఉత్సాహం అంబరాన్నంటింది. క్రీడాభిమానుల కోలాహలంలో సింగరేణి ఆర్‌ఆర్ జట్టులో ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా ఫుట్‌బాల్ క్రీడాకారిణి ఆర్తి తళుక్కున మెరిసింది. జిల్లా పేరును ఒక్కసారిగా మారుమోగించింది. ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సింగరేణి ఆర్‌ఆర్ జట్టు, ఫుల్‌బాల్ స్టార్ క్రీడాకారుడు లయోనల్ మెస్సీ జట్టుతో ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్ జట్టులో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలకు చెందిన క్రీడాకారిణి ఆర్తి పాల్గొంది. సీఎంతో కలిసి ఫుట్‌బాల్ ఆడింది. ఆర్తి స్వగ్రామం నిర్మల్ జిల్లా రాణపూర్‌తండా కాగా.. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు. గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఫుట్‌బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున జాతీయ స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను మెస్సీ షో కోసం ఎంపిక చేసినట్లు కోచ్ రవికుమార్ తెలిపారు. రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టులో 10మంది బాలురు ఉండగా.. ఇద్ద రు బాలికలు ఎంపికయ్యారు. ఇందులో ఒకరు ఆర్తి కావడం ఉమ్మడి జిల్లాకే గర్వకారణం.
రాష్ట్ర స్థాయిలో గోల్డ్‌మెడల్..
ఆర్తి 2023–24లో వనపర్తిలో జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకం అందుకుంది. జార్ఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించింది. 2024–25లో నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించింది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొంది. తెలంగాణ ఉమెన్స్ లిక్ బెస్ట్ ప్లేయర్ అవార్డూ అందుకుంది.


