గాడి తప్పిన సింగరేణి వ్యవస్థ
● ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ ప్రసాద్
శ్రీరాంపూర్: సింగరేణి వ్యవస్థ గాడి తప్పిందని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బీ.జనక్ ప్రసాద్ అన్నారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిందన్నారు. ఉన్నత స్థాయిలో అధికారులు సరైన నిర్ణయాలు తీసుకోకుండా సంస్థకు నష్టం చేకూరుస్తున్నారన్నారు. కొత్తగనులు లేక ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లాయన్నారు. నెలనెల తరబడి మెడికల్ బోర్డుకు పిలువకపోవడం వల్ల కార్మికులు లక్షల రూపాయాలు నష్టపోతున్నారన్నారు. 25 మంది సీనియర్ యూనియన్ నేతలతో కమిటీ ఏర్పాటు చేసి వారితో మంత్రులను కలిసి కార్మికుల సమస్యలు వివరిస్తామన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో తనకు మాట్లాడే అవకాశం దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ఆ యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, ఉపాధ్యక్షులు జెట్టి శంకర్‌రావు, కలవేన శ్యాం, ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు భీంరావు, ల్యాగల శ్రీనివాస్, పెట్టం శ్రీనివాస్, రావుల అనిల్, తోకల సురేష్ యాదవ్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.


