కార్పొరేషన్ ‘చమురు’ వదిలిస్తున్నారు..!
పెట్రోల్, డీజిల్‌పై నియంత్రణ కరువు
ప్రతీ నెల వ్యయంలో తేడాలు
వాహనాల నుంచి ఇంధనం చోరీ
జీపీఎస్ ట్రాకింగ్ లేక తిరగని చెత్త వాహనాలు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లోని వాహనాల్లో పెట్రోల్, డీజిల్ వినియోగంపై నియంత్రణ కరువైంది. ప్రతీ నెల రూ.21లక్షలకు పైగా వ్యయం చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ చమురును దుర్వి నియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్‌కు చెందిన స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీలు, ప్రొక్లెయిన్‌లు, ల్యాడర్, బయో టాయిలెట్ బస్సులు, వైకుంఠ రథాలు మొత్తంగా 123వరకు వాహనాలు ఉన్నాయి. వీటిని ఆయా పనులకు నగరంలో తిప్పుతుండగా.. సుమారు 20 వరకు వాహనాలు ప్రతీ నెల ఏదో ఒక మరమ్మతుతో రోడ్లపైకి రావడం లేదు. ప్రతీ రోజు పెట్రోల్, డీజిల్ పోయిస్తున్నారు. ఆయా వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయి, ఎంత మేర పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నారనే దానిపై సరైన పర్యవేక్షణ లేదు. వాహనాలు తిరిగినా, తిరగకున్నా లెక్క ప్రకారం ఇంధనం పోయిస్తున్నారని తెలుస్తోంది. వాహనాలను అవసరం మేరకు తిప్పకుండానే అందులో మిగిలిన పెట్రోల్, డీజిల్‌ను డ్రైవర్లు బాటిళ్లలో తీసి అమ్ముకున్న సంఘటనలు ఇటీవల బయటపడ్డాయి. ఆయా డ్రైవర్లను చర్యలు తీసుకున్నా పర్యవేక్షణ లోపించి ప్రజాధనం వృథా అవుతోందనే ఆరోపణలున్నాయి.
జీపీఎస్ ట్రాకింగ్ లేకనే..
కార్పొరేషన్‌లో ప్రతీ నెల రూ.21 లక్షలకు పైగా వి లువైన పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నారు. గతంలో ప్రతీ వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసి ఏ వాహనం ఎక్కడెక్కడ తిరుగుతుందో పర్యవేక్షించేవారు. పలు వాహనాల తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని, రూ.లక్షలు ఖర్చు చేసి మ రమ్మతు చేయిస్తున్నారు. మరమ్మతుకు గురైన వా హనాలు ఆ నెలలో తిరగకపోయినా ఇంధనం ఖర్చు ఏమాత్రం తగ్గకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ వాహనాలతో పాటు కొందరు సిబ్బంది సొంత వాహనాల్లో పెట్రో ల్, డీజిల్ పోయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వా హనాలు మరమ్మతుకు గురైనా ప్రతీ నెల ఖర్చు తగ్గకపోవడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. జీపీఎస్ ట్రాకింగ్ లేకపోవడంతో కొందరు డ్రైవర్లు వారి కి కేటాయించిన ఏరియాల్లో పూర్తిస్థాయిలో తిప్పకుండా ఇంధనాన్ని మిగిల్చి వాహనాన్ని మున్సిపల్‌లో అప్పగించే ముందు బాటిళ్లలోకి తీసుకుంటున్నారు. ఇటీవల బయటపడిన వీడియోలే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆటోలను ఇంటింటికి తిప్పి చెత్త సేకరించాల్సి ఉండగా.. కొన్ని ఏరియాలకు వెళ్లకుండా మిగులు ఇంధనాన్ని అమ్ముకుంటున్నట్లు బయటపడింది. చెత్త సేకరణ సక్రమంగా చేయకపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోయి నగరం చెత్తమయంగా మారుతోంది.


