అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో వంద పడకల అసుపత్రి, గిరిజన ఆశ్రమ పాఠశాల భవనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అమృత్ 2.0 నిర్మాణ పనులను అధికారులు, కాంట్రాక్టర్ల సమన్వయంతో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం పట్టణంలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను ఆయన సందర్శించారు. వంద పడకల ఆసుపత్రి పూర్తయితే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని తెలిపారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వేసవికాలంలోగా అమృత్ 2.0 పనులు పూర్తి చేసి తాగునీరు అందించాలని అన్నారు. పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


