కడెం రేంజ్ వైపు పులి అడుగులు
జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌లో పులి అలజడి తగ్గింది. పది రోజులుగా అడవిలో ఉంటూ భయపెట్టిన పులి ఈ అడవి దాటింది. కడెం రేంజ్ వైపు అడుగులు వేసింది. అక్కడ మూడు రోజులు తిరిగి గోదావరి తీరం దాటినట్లు తెలుస్తోంది. జన్నారం అటవీ డివిజన్‌లో గత నెల 25న ఇందన్‌పల్లి రేంజ్‌లో ఆవును చంపింది. అప్పుడు అటవీ శాఖ అధికారులు పరిశీలించి పులిదాడిగా గుర్తించారు. అప్పటి నుంచి టైగర్ మానిటరింగ్, అటవీ సిబ్బంది పులి కదలికలను పరిశీలించారు. సీసీ కెమెరాలు అమర్చి ఎప్పటికప్పుడు అడుగులు, కదలికలు గమనించారు. చంపిన ఆవు మాంసాన్ని రెండ్రోజులు తిన్నట్లు కెమెరాలో చిక్కింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో పులి అరుపులు కూడా అటవీ సిబ్బంది విన్నారు.
జత లేకనే..
జన్నారం అటవీ డివిజన్‌కు వచ్చిన పులిని మగపులిగా అటవీ అధికారులు గుర్తించారు. ఆడపులి జత కోసం ఇక్కడికి వచ్చినట్లు భావించారు. ఆడపులి తోడు ఈ ప్రాంతంలో దొరక్కపోవడంతో ఇక్కడి నుంచి కడెం రేంజ్‌లోకి ప్రవేశించింది. కడెం రేంజ్‌లోని దస్తురాబాద్ మండలం ఎర్రగుంటపల్లె బీట్‌లో తిరిగినట్లు అటవీ అధికారులు పాదముద్రలు గుర్తించారు. రెండ్రోజుల తర్వాత అక్కడా కనిపించలేదు. పులి అక్కడి నుంచి గోదావరి నది దాటి సారంగాపూర్ అటవీ ప్రాంతంలో ప్రవేశించినట్లు అటవీ అధికారులు అనుమానించారు. ఇటీవల సారంగపూర్ అటవీ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఆ పులి ఇక్కడి నుంచే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఇందన్‌పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను సంప్రదించగా, పులి పది రోజులుగా జన్నారం అడవుల్లో ఉండి కడెం రేంజ్‌లోకి వెళ్లిందని, అక్కడి నుంచి గోదావరి దాటినట్లు తెలిసిందని పేర్కొన్నారు.
పులుల ఆచూకీకి
అధికారుల గాలింపు
జైపూర్: మండలంలో పులుల సంచారంపై అట వీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందారం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు ఉండడంతోపాటు శుక్రవారం దుబ్బపల్లి మామిడితోటల సమీపంలో పులి గాండ్రింపులు వినిపించినట్లు తోటలకాపరులు తెలిపారు. జైపూర్ ప్రాంతంలోని పులి ముదిగుంట గ్రామం మీదుగా ఈ వైపు రాగా, వేలాల అటవీ ప్రాంతంలో మరొకటి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


