ఉద్యమం ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు
మంచిర్యాలఅర్బన్: సమష్టి ఉద్యమం ద్వారానే 42శాతం బీసీ రిజర్వేషన్లు సాధిద్దామని, ప్రాణత్యాగాలు చేసే అవసరం లేదని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం మంచిర్యాల వీవీడీసీ కళాశాలలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వరచారి ఆశయసాధనకు బీసీ సంఘాలు, రాజీకీయ, కుల విద్యార్థి సంఘాలతో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శీతాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్లు చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చేరాల వంశీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ పల్లె భూమేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉదారి చంద్రమోహన్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెండ్ల శ్రీనివాస్, నాయకులు గుమ్ముల శ్రీనివాస్, టీబీఎస్‌ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్, రాజ్‌కిరణ్, రాజేశం భాస్కర్ పాల్గొన్నారు.


