చెరువులో పడి మేకలకాపరి మృతి
నర్సాపూర్(జి): ప్రమాదవశాత్తు చెరువులో కాలు జారి నీట మునిగి ఒకరు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నందన్ గ్రామానికి చెందిన మేకల కాపరి పత్రి ఓమేశ్ (34) శుక్రవారం మేకలు మేపుతూ నందన్ మీది చెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి నీట మునిగి మృతి చెందాడు. గమనించిన మరొక మేకల కాపరి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గజ ఈతగాళ్ల సహాయంతో ఓమేశ్ మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య దేవా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు దేవేందర్, కూతురు అక్షిత ఉన్నారు.


