హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు మూడోస్థానం
ఆదిలాబాద్: అండర్–14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్‌లో జిల్లా క్రీడాకారులు మూడో స్థానంలో నిలిచారు. వనపర్తి వేదికగా ఈనెల 10నుంచి శుక్రవారం వరకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచారు. మొదట మహబూబ్‌నగర్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆదిలాబాద్ జట్టు 1–2 స్కోర్ తేడాతో పరాభవాన్ని చవిచూసింది. తర్వాత మూడోస్థానం కోసం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 4–1 స్కోర్ తేడాతో విజయకేతనం ఎగురవేసింది. టోర్నీ విజేతగా మహబూబ్‌నగర్, రెండో స్థానంలో నల్గొండ జట్లు నిలిచినట్లు శిక్షకులు శేఖర్ వివరించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరచడంపై హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, కోరెడ్డి పార్థసారథి అభినందనలు తెలిపారు.


