ప్రసవం.. ప్రాణాంతకం
ఈఏడాది ఇప్పటివరకు జిల్లాలో ఆరుగురు బాలింతలు మృతిచెందారు. 204 మంది నవజాత శిశువులు కన్నుమూశారు. గతేడాది ఆరుగురు బాలింతలు, 176 మంది నవజాత శిశువులు మరణించారు.
గాదిగూడ మండలంలోని ఝరి పీహెచ్‌సీకి చెందిన పెందూర్ భీంబాయి ఏప్రిల్‌లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరణించింది.
ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరానికి చెందిన బాలింత దుర్వ హెత్మబాయి సెప్టెంబర్ 15న రిమ్స్‌లో చనిపోయింది.
ఇచ్చోడ పీహెచ్‌సీ పరిధిలోని బాదిగూడకు చెందిన బాలింత అనురాధ అక్టోబర్ 13న రిమ్స్‌లో మృతిచెందింది.
ఇంద్రవెల్లికి చెందిన బాలింత రుక్మాబాయి నవంబర్ 21న రిమ్స్‌లో మరణించింది.
హస్నాపూర్‌కు చెందిన బాలింత జంగుబా యి నవంబర్ 24న ఇంట్లో చనిపోయింది.
ఆదిలాబాద్‌టౌన్: మహిళలకు మాతృత్వం ఓ వరం లాంటిదంటారు. నవమాసాలు మోసి బిడ్డ మురుపాన్ని చూడాల్సిన కొందరు మాతృమూర్తులు ప్రసవ వేదనకు గురై ప్రాణాలు వదులుతున్నారు. తమ ఒడిలో కన్నబిడ్డలను చూసుకునే అవకాశం లేకుండానే మృత్యువు ఒడికి చేరుకుంటున్నారు. కళ్లు తెరిచి లోకాన్ని చూడకముందే నవజాత శిశువులకు నూరేళ్లు నిండుతున్నాయి. ఈఏడాది ఆరుగురు బాలింతలు జిల్లాలో మృత్యువాత పడటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎస్‌ఎంసీయూలో చికిత్స పొందుతూ 204 మంది నవజాత శిశువులు కన్నీటి శోకం మిగిల్చారు. తాజాగా గురువారం రిమ్స్‌లో ఓ బాలింత మృతిచెందగా, పుట్టిన బిడ్డ చనిపోయింది. పురిటిలోనే బిడ్డ చనిపోగా, మనోవేదనకు గురైన ఆ కుటుంబంలో కొంత సమయంలోనే బాలింత కూడా మృతిచెందడంతో వారు రోధనలు మిన్నంటాయి.
ఆందోళన కలిగిస్తున్న మాతా, శిశుమరణాలు
జిల్లాలో మాతాశిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ ఆగడం లేదు. గతనెలలోనే ఇద్దరు బాలింతలు మృతిచెందగా, తాజాగా మరో బాలింతతో పాటు పుట్టిన బిడ్డ మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది 1465 మంది చిన్నారులను రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూలో ఉంచగా, 204 మంది మృతిచెందారు. 46 మందిని రిఫర్ చేశారు. ఇందులో లేబర్ రూమ్‌లో డెలివరీ టైమ్ దాటడంతో 80 మంది, నెలలు నిండని కారణంతో 59 మంది, కడుపులో ఆక్సిజన్ అందక 28 మంది, ఇన్ఫెక్షన్‌తో 11 మంది, కడుపులో మలం మింగి నలుగురు, తక్కువ బరువు గల చిన్నారులు 19 మంది, అవయవ లోపంతో ముగ్గురు నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. గతేడాది ఎస్‌ఎన్‌సీయూలో 1335 మందిని ఉంచగా, 176 మంది మృతిచెందారు. 46 మందిని రెఫర్ చేశారు.
బాలింతలు, నవజాతశిశువు మరణాలు..
విచారణ చేపడుతున్నాం
రిమ్స్‌లో బాలింత, శిశువు మృతిపై విచారణ చేపడుతున్నాం. కుటుంబ సభ్యులతో పాటు రిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడాం. కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నారు. ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం.
– మనోహర్, ఏజెన్సీ అడిషనల్ డీఎంహెచ్‌వో
అసలేం జరిగిందంటే..
ఉట్నూర్ మండలం పిట్లగూడకు చెందిన ఎల్లన్న–గంగసిల దంపతులు. గంగసిల (30) నిండుగర్భిణి కావడంతో ఈనెల 8న ప్రసవ సమయం ఇచ్చారు. కుటుంబీకులు ఈనెల 9న రిమ్స్ మెటర్నటీ వార్డులో చేర్పించారు. బుధవారం రాత్రి ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వైద్యుల వద్దకు వెళ్లి ఈ విషయాన్ని తెలిపారు. అక్కడ ఉన్న వైద్యులు వారితో దురుసుగా ప్రవర్తించారు. పురిటినొప్పులు వస్తున్నాయని చెబితే మాకు తెలుసా.. మీకు తెలుసా.. వైద్యులు మేమా.. మీరా అంటూ వారితో మాట్లాడారు. గర్భిణి తల్లడిల్లుతున్నా సిబ్బంది పట్టించుకోలేదని వారు ఆరోపించారు. సుఖప్రసవం కోసం తెల్లవారుజామున 5 గంటల వరకు వేచిచూశారు. సిబ్బంది కడుపులో నొక్కడంతోనే పుట్టబోయే మగబిడ్డ చనిపోయిందని తెలిపారు. బాలింతకు రక్తస్రావం అధికంగా కావడంతో ఎంఐసీయూలోకి చేర్పించగా ఉదయం చనిపోయింది. మృతురాలికి మూడేళ్లు, ఏడేళ్ల ఆడబిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డ చనిపోగా, ఆమెకు ఇది నాలుగో కాన్పు. భర్త వ్యవసాయ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే భార్య, పుట్టిన బిడ్డ మృతిచెందడంతో కన్నీరుమున్నీరయ్యాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్రసవం.. ప్రాణాంతకం
ప్రసవం.. ప్రాణాంతకం


