ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
శ్రీరాంపూర్: ఈ నెల 23న సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. గురువారం జీఎం కార్యాలయంలో డిపార్ట్‌మెంట్ల ముఖ్య అధికారులతో వేడుకలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు జీఎం కార్యాలయం వద్ద, 11 గంటలకు ప్రగతి మైదానంలో జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేక స్టాళ్ల ఏర్పాటు, సాయంత్రం 5.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు. ఏరియాలో ఉత్తమ ఉద్యోగులకు, సేవా కార్యకర్తలకు, ఉత్తమ గృహాలను ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏరియా ఎస్‌ఓటు జీఎం సత్యనారాయణ అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
రక్షణలో ముందు నిలువాలి
శ్రీరాంపూర్/జైపూర్: బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణలో ముందు నిలువాలని జీఎం శ్రీనివాస్ తెలిపారు. గురువారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలోని సీహెచ్‌పీ, జైపూర్ మండలం ఇందారం ఐకే1ఏ గనిలో 56వ రక్షణ పక్షోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రక్షణతో కూడిన ఉత్పత్తి కంపెనీకి శ్రేయస్కరమన్నారు. అనంతరం ఉద్యోగులతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం తనిఖీ బృందం కన్వీనర్ కృష్ణమూర్తి ిసీహెచ్‌పీని తనిఖీ చేసి రక్షణ చర్యలను పరిశీలించారు. ఏరియా ఇంజనీర్ రమణారావు, ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్లు, గని మేనేజర్ శ్రీనివాస్, గంగాధర్ గుర్తింపు సంఘం నాయకులు కొమురయ్య, మోతె లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.


