పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఆదిలాబాద్‌రూరల్: ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతో పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ నుంచి కరంజీకి బయలుదేరిన ఆర్టీసీ బస్సు జందాపూర్ గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద టైర్ పేలడంతో పక్కనే ఉన్న పంటపొలాల్లోకి దూసుకెళ్లి ఒకే వైపుకు ఒరిగింది. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. సాయంత్రం కావడంతో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు వందమందికి పైగా ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఒకరిద్దరికి స్వల్పగాయాలుకాగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బస్సును ప్రమాదం నుంచి తప్పించిన డ్రైవర్‌ను ప్రయాణికులతో పాటు ఆర్టీసీ అధికారులు అభినందించారు. ఈ విషయంపై ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్‌ను సంప్రదించగా బస్సు టైరు పేలడంతో ఘటన జరిగిందని, ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదన్నారు.


