ప్రచారంలోనే మన కూలీలు..!
మంచిర్యాలఅగ్రికల్చర్: మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ కూలీలు ప్రచారం బాట పట్టారు. కూలీకి వెళ్తే రూ.300నుంచి రూ.400 వరకు ఇస్తుండగా.. ఏ పార్టీ ప్రచారానికై నా వెళ్తే రూ.500 నుంచి రూ.600 కూలితోపాటు టిఫిన్, భోజనం, పురుషులకు మద్యం ఇస్తున్నారు. దీంతో జిల్లాలోని కూలీలు చాలామంది ప్రచారంలో పాల్గొంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం పత్తి తీత, వరి కోత పనులు ఊపందుకున్నాయి. ఒకేసారి ఆయా పంటలు చేతికి రావడంతో కూలీల కొరత ఏర్పడింది. మరోవైపు యాసంగి పంటలకు సిద్ధమవుతున్న తరుణంలో రైతులకు కూలీ దొరక ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంది. అటు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో స్థానిక కూలీలు ప్రచారంలో పాల్గొంటుండగా.. మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్ తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలు కుటుంబ సమేతంగా పత్తి తీత పనుల్లో పాల్గొంటున్నారు.


