టీచర్ డిప్యూటేషన్ రద్దు చేయాలని ధర్నా
భీమారం: భీమారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రమీల డిప్యూటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. టీచర్‌ను తిరిగి రప్పించే వరకు పిల్లలను బడికి పంపించబోమంటూ ఇళ్లకు తీసుకెళ్లారు. పాఠశాలలో 67 మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయురాలు ప్రమీలను ఇదే మండలంలోని రెడ్డిపల్లి పాఠశాలకు డిప్యూటేషన్ పంపించారు. ప్రమీల వచ్చిన తర్వాతే విద్యాప్రమాణాలు పెరిగాయని, బోధన బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. హెచ్‌ఎంతోపాటు నలుగురు ఉపాధ్యాయులు ఉండగా.. హెచ్‌ఎం అనారోగ్యంతో ఉన్నారని పేర్కొన్నారు. విద్యాబోధన బాగుందనే ఉద్దేశంతో ప్రైవేటు నుంచి టీసీ తీసుకొచ్చి ఇక్కడ చేర్పించామని అన్నారు. అక్రమ డిప్యూటేషన్ రద్దు చేసి తిరిగి పాఠశాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. డీఈవో ఆదేశాల మేరకు డిప్యూటేషన్‌పై పంపించామని ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు.


