చదువులో రాణించలేక‘పోతున్నా’
● పదో తరగతి విద్యార్థి బలవన్మరణం ● నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘటన
నిర్మల్‌టౌన్: చదువులో రాణించలేక పోతున్నానని మనస్తాపంతో పదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన సురేష్, లహరి దంపతులు కొంతకాలంగా జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు ప్రసాద్ (16) ప్రస్తుతం పదోతరగతి చదువుతున్నాడు. ఆదివారం కుటుంబ సభ్యులంతా కలిసి స్వగ్రామంలో జరిగే కార్యక్రమానికి వెళ్లారు. ప్రసాద్ మధ్యాహ్నమే నిర్మల్‌కు వచ్చి ఉరేసుకున్నాడు. వడ్యాల్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.


