పశువులు బలి!
‘కవ్వాల్’లో పులుల ఆకలికి రూ.లక్షల ఖర్చు రెండేళ్లలోనే రూ.20 లక్షలు చెల్లింపు వన్యప్రాణులు తగ్గి ఆవులు, ఎద్దులు, గేదెలపై దాడులు ఆహారపు గొలుసులో అసమతుల్యతే ప్రధాన లోపం
పులి పంజాకు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కవ్వాల్‌లో పులుల ఆకలికి రైతుల పశువులు బలైపోతున్నాయి. పెద్దపులుల పంజా దెబ్బకు పశువుల యజమానులకు పరిహారం చెల్లించాల్సి వస్తోంది. రెండేళ్లలో కవ్వాల్ టైగర్ రిజర్వులో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 121 పశువులకు రూ.20 లక్షలు చెల్లించారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్‌ల్లోనే 97 పశువులకు గానూ రూ.15 లక్షలకు పైగా ఉన్నాయి. అడవిలో శాకాహార జంతువుల లభ్యత తగ్గిపోవడంతో మేతకు వెళ్లిన ఆవులు, ఎద్దులు, గేదెలపై పులులు దాడి చేసి పొట్ట నింపుకుంటున్నాయి. 2015 నుంచే అడపాదడపా పశువులపై పులుల దాడులు మొదలు కాగా ఇటీవల మరింత పెరిగింది.
పులులు చంపితే వేగంగా పరిహారం
పశువు వయస్సు, ఆడ, మగ, గేదె, చూడి, పాలిచ్చే వి వంటివి పరిగణలోకి తీసుకుని పశు వైద్యుడు, అటవీ అధికారుల సమక్షంలో లెక్కగట్టి పరిహారం ఇస్తున్నారు. గతంలో పరిహారం చెల్లింపులో జాప్యం జరిగేది. ప్రస్తుతం వారం రోజుల్లోనే అందుతోంది. రెండేళ్ల క్రితం కాగజ్‌నగర్ డివిజన్‌లో తమ పశువుల్ని చంపేస్తున్నాయని ఓ రైతు విషం పెట్టి రెండు పులులను చంపేశాడు. అప్పటి నుంచి పరిహారం పెంచేసి జిల్లా స్థాయిలోనే నిధులు సమకూర్చుకు ని, చెల్లింపు సులువు చేశారు. ఇటీవల మీ సేవ కేంద్రం నుంచే ప్రక్రియ జరిగేలా చేస్తున్నారు. మనుషులు చనిపోతే రూ.10 లక్షలు ఇస్తున్నారు.
దెబ్బతిన్న జీవ వైవిధ్యం
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల నుంచి పులులు ఆహారం, ఆవా సం, తోడు వెతుక్కుంటూ పెన్‌గంగ, ప్రాణహిత నదులు దాటుతున్నాయి. కవ్వాల్‌లో సువిశాలమైన ఆవాసం ఉంది. కానీ ఇక్కడి పరిస్థితి అనుకూలించ క కొన్ని తిరిగి వెళ్తున్నాయి. అ నుకూలమనిపిస్తేనే కొంతకా లం ఉంటున్నాయి. అలా ఇక్క డ ఆవాసం చేసుకున్న పాల్గుణ వంటి పులుల సంతానంతోనే వృద్ధి జరిగింది. పులి ఉంటే జీవ వైవి ధ్యానికి ప్రతీకగా చెబుతారు. అ యితే ఆహారపు గొలుసులో మొ క్కలు, వాటిపై ఆధారపడే శాకా హార, వాటిపై మనుగడ సాగించే మాంసాహార జంతువులు సమపాళ్లలో ఉండాలి. రెండు దశాబ్దాల్లో అడవుల్లో జీవ వైవిధ్యం దెబ్బతిని, విచ్చలవిడిగా చెట్ల నరికివేత, వేటలతో చిరుప్రాణులు తగ్గిపోయాయి. ఈ అసమతుల్యత వలన శాకాహార జంతువులు లేక సులువుగా దొరికే ఆవులు, ఎద్దులు, గేదెలపై దాడి చేస్తున్నాయి.
ఒకసారి 20 కిలోలపైనే భక్షణ
రెండేళ్లు పైబడిన పులి ఆకలితీరాలంటే కనీసం 20 కిలోలకు పైనే మాంసం ఆరగిస్తుంది. మళ్లీ రెండు, మూడు రోజుల వరకు తిండి జోలికి వెళ్లదు. వేట వీలు కాకపోతే వారం రోజులైనా ఆకలికి తట్టుకోగలదు. కొన్నిసార్లు తల్లి పులి వేటాడడం నేర్పించేందుకు కూడా పశువులపై దాడి చేస్తూ తన పిల్లలకు వేట రుచి చూపించిన సందర్భాలు ఉన్నాయి.
దాడి చేస్తేనే జాడ తెలిసేది
అడవుల్లో ఏ పులి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి యానిమల్ ట్రాకర్స్, నీటి కుంటలు, ఆవాసాల వద్ద కెమెరాలతో ట్రాప్ చేస్తున్నారు. అయితే పశువును దాడి చేసిన సమయంలో స్పష్టంగా పులుల కదలికలు తెలుస్తున్నాయి. ఒకసారి దాడిచేస్తే, రెండు, మూడుసార్లు ఆ ప్రాంతానికి వస్తాయి. దీంతో అక్కడే కెమెరాలు బిగిస్తుండడంతో వాటి జాడ తెలుస్తోంది.
కోర్‌లోకి పులి
కవ్వాల్‌లో అతిపెద్ద సమస్య కోర్‌లో కాకుండా బఫర్ జోన్‌లోనే పులుల సంచారం. బఫర్ ఏరియాలైన ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో వారానికో పశువు పులికి బలవుతోంది. అయితే కోర్ ప్రాంతం వరకు పులులు వెళ్లాలంటే పోడు, పత్తి చేన్లు, జాతీయ రహదారులు, సింగరేణి ఓపెన్‌కాస్టులు, స్థానిక గ్రామాలు ప్రధాన అవరోధాలు. అయినప్పటికీ అధికారులు కోర్‌లో గడ్డి క్షేత్రాలు పెంచి జింకలు, దుప్పి, మెకం, అడవిపందులు, తదితర శాకాహార జంతువులను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మూషిక జింకల్ని ప్రత్యేకంగా అడవుల్లో వదలారు. పులుల సంచారం లేనిచోట్ల శాకాహార జంతువులు ఉండగా మైదాన ప్రాంతాలుగా మారిన అడవుల్లో రైతుల సాదు జంతువులే పులులకు ప్రధాన ఆహారంగా మారాయి.
రెండేళ్లలో మృతి చెందిన పశువులు, చెల్లించిన పరిహారం
సంవత్సరం జిల్లా పశువులు పరిహారం(రూ.ల్లో)
2024 మంచిర్యాల 07 76,000
––– ఆసిఫాబాద్ 59 9,76,000
––– ఆదిలాబాద్ 01 40,000
2025 మంచిర్యాల 16 2,67,800
––– ఆసిఫాబాద్ 38 5,81,000


