మొసళ్లకు మంచిరోజులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రానికి మంచిరోజులు రానున్నాయి. గత కొన్నాళ్లుగా ఆదరణ లేక మొసళ్లకు సరైన పర్యవేక్షణ కొరవడింది. ఈ క్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ చొరవ తీసుకుని దేశంలో మొసళ్లు, సరీసృపాల సంక్షేమం కోసం పాటు పడుతున్న ప్రముఖ సంస్థ ‘మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ ట్రస్ట్, సెంటర్ ఫర్ హెర్పటాలజీ’ ప్రతినిధులను ఇక్కడి పరిస్థితిపై అధ్యయనానికి ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఆ సంస్థ ట్రస్టీ గణేశ్ ముత్తయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ షఫీక్ అహ్మద్, రాజశేఖర్, చెన్నూర్ రేంజ్ అధికారి ప్రభాకర్, స్థానిక అటవీశాఖ అధికారులతో కలిసి ప్రాథమిక అవగాహన కోసం జైపూర్ మండలం శివ్వారం పరిధిలోని గోదావరి పరీవాహక మొసళ్ల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడున్న మొసళ్లు, వాటి ఆవాసం, తదితర విషయాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అధ్యయనం చేసి కార్యాచరణ
శివ్వారం మొసళ్ల అభయారణ్యంగా గుర్తించి, పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సి ఉన్నా, ఆచరణలో అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే గత కొన్నాళ్లుగా గోదావరి నీటిలభ్యతలో గతంలో కంటే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొసళ్లు అధికంగా సంచరించే ఎల్‌మడుగుపై దిగువన కాళేశ్వరం, ఎగువన అన్నారం బారాజ్‌తో గేట్లు ఎత్తినప్పుడు, దించినప్పుడు నీటి నిల్వల్లో వ్యత్యాసాలు వస్తున్నాయి. దీంతో మొసళ్ల జీవనంపై ప్రభావం చూపుతోంది. అంతేకాక చేపలు పట్టడంతోనూ మొసళ్లకు ఆహార లభ్యతపై ప్రభావం పడుతోంది. దీంతో కాలక్రమేణ వాటి అనుకూల ఆవాసాలకు ఇబ్బందిగా మారుతోంది. ఇక వేసవిలో నీరు లేనప్పుడు మొసళ్లకు మరింత ఇబ్బంది వస్తోంది. ఈ క్రమంలో వాటి ఆహారం, ఎదుగుదల, పునఃరుత్పత్తి తదితర వాటి పూర్తిస్థాయిలో నిపుణులు అధ్యయనం చేసి ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఇందుకు రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులపై విస్తృతంగా చర్చించనున్నారు. అంతేకాక పలుమార్లు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశాక తమ కార్యాచరణ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఇక్కడ మొసళ్ల వృద్ధి జరిగితే జిల్లాలో పర్యాటకంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
మొసళ్లకు మంచిరోజులు


