డీసీసీపై వీడని ఉత్కంఠ!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎన్నిక అంశం ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీలో గతంలో ఎన్నడూ లేన్నట్లుగా ఈ సారి కొత్త నిబంధనలు, ఎంపిక విధానాల తీరు మారింది. దీంతో ఎవరిని అధ్యక్ష పీఠం వరిస్తుందో.. అనే చర్చ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. తుది ఎంపిక ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీఎం, పీసీసీ చీఫ్ తుది నిర్ణయమే ఫైనల్‌గా ఉండేది. అయితే.. పార్టీలో అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రధానంగా కష్టపడ్డవారిని గుర్తించాలని, సామాజిక, స్థానిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు పరిశీలకులను నియమించి డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు చేస్తోంది.
ఎంపికలో వీరే కీలకం..
మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ నరేశ్‌కుమార్, పీసీసీ పరిశీలకులు అడువాల జ్యోతి, పులి అనిల్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో కీలకంగా మారారు. ఇక జిల్లా నుంచి మంత్రి వివేక్ వెంకట స్వామితో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అభిప్రాయాలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలు సంఘాల బాధ్యుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. జిల్లాలో 28మంది పార్టీ నాయకులు డీసీసీ అధ్యక్ష పదవిపై ఆసక్తి కనబరిచి దరఖాస్తు చేసుకున్నారు. వీరందరితోనూ ప రిశీలకులు వ్యక్తిగతంగా మాట్లాడారు. పార్టీలో కనీ సం ఐదేళ్ల అనుభవం, పార్టీని నడిపే సత్తా, కేడర్‌ను సమన్వయం చేయగల సమర్ధత లాంటి అర్హతలు పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను వడబోసి షార్ట్ లిస్ట్ తయారు చేసి మూడు పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆశావహుల లాబీయింగ్
రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేయనున్న నేపథ్యంలో వెనుకబడిన వర్గాల నుంచి ఓ నాయకుడిని ఎంపిక చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా జిల్లాలోని రెండు అసెంబ్లీ, ఎంపీ ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు కావడంతో అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఇవ్వాలంటే ఓసీ లేదా బలహీన వర్గాలకు చెందిన నాయకులకు అవకాశమివ్వడంపై సమాలోచనలు చేస్తున్నారు. అయితే.. డీసీసీ అధ్యక్ష పీఠంపై గంపెడాశలు పెట్టుకున్న ఇద్దరు నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు, ఏఐ సీసీ అబ్జర్వర్లు, గాంధీభవన్‌లో సీనియర్ నేతలతో ఢిల్లీ వరకు లాబీయింగ్ చేసుకుంటున్నట్లు తెలిసింది. అధిష్టానం చివరకు ఎవరికి డీసీసీ పీఠం కట్టబెట్టనుందో త్వరలోనే తేలిపోనుంది.
సీనియర్లకే అవకాశం
ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, సమీప బంధువులకు అవకాశం ఇవ్వకపోవడంతో పా టు సీనియార్టీని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నేళ్లుగా పార్టీలో పని చేస్తున్నా రు? గతంలో వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులకు ఏవైనా పదవులు వచ్చాయా? లాంటి అంశాల ను పరిశీలిస్తున్నారు. నామినేటెడ్ పదవులు, ఇత ర పార్టీ పదవులు అనుభవించినవారికి అవకా శం తక్కువేనని చెబుతున్నారు. అధ్యక్షుడిగా ఎంపికై నవారు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను సమన్వయం చేయాలి. జిల్లాలోని ఎమ్మెల్యేలతో సఖ్యత, రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉండే జిల్లా పదవి కావడంతో ఆచితూచీ అన్ని కోణాల్లో వడపోసి సీనియర్ నాయకుడికి అవకా శం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే షార్ట్ లిస్ట్ నుంచి సామాజిక కోణం లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స మాచారం. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కో ణంతో పాటు కొత్తవారికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, యువతను ఆకర్షించేందుకు చురుగ్గా ఉండే నాయకుడిని ఎంపిక చేస్తున్నారనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. జిల్లాలో పదవి ఆశిస్తున్న వారిలో ఒకరిద్దరి పేర్లు తుది జాబితాకు చేరినట్లు తెలిసింది.


