అధిక సాంద్రత పత్తి సాగు చేయాలి
కాసిపేట: జిల్లా రైతులు వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు అధిక సాంద్రత పత్తి సాగు సాంకేతికతను అవలంబించాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. శనివారం మండలంలోని సండ్రల్ పహాడ్ శివారులో అధిక సాంద్రత పత్తిసాగుపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు అధిక సాంద్రత పత్తిసాగుపై అవగాహన కల్పించారు. ప్రతీ ఎకరాకు అధిక మొక్కల సాంద్రత ఉంచడం ద్వారా దిగుబ డులు పెరగడం, నేల సారాన్ని కాపాడటం లాంటి ప్రయోజనాల గురించి వివరించారు. పత్తి మొక్కల ఎత్తు ఆధారంగా మెపిక్వాట్ క్లోరైడ్ స్ప్రే వాడకం, పోషక లోప లక్షణాలు, కీటక వ్యాధి లక్షణాల మ ధ్య తేడా వివరించారు. సమగ్ర పోషక నిర్వహణ, యాంత్రిక పత్తికోత, సమగ్ర కీటక వ్యాధి నిర్వహణ పద్ధతులపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏడీఏ రాజనరేందర్, కేవీకే శాస్త్రవేత్తలు ఎన్.మహేశ్, నాగరాజు, ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, ఏఈవో శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.


