సిటిజన్ బడ్డీ.. పరిష్కారం లేదండీ!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం ‘సిటిజన్ బడ్డీ’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక సమస్య పరిష్కారం కోసం రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగకుండా స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌పై ఒక క్లిక్‌తో సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ఈ యాప్ తయారు చేయబడింది. అయితే ఇంటి నుంచి బడ్డీ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసే ఫిర్యాదులను పరిష్కరించడంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
అన్నీ యాప్‌లోనే..
మంచిర్యాల నగర ప్రజలకు 2018 నుంచి ‘సిటిజన్ బడ్డీ’ యాప్ అందుబాటులోకి వచ్చింది. యాప్‌లో కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించి పూర్తి సమాచారంతో పాటు ప్రజాప్రతినిధులు, ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీలోని వివిధ విభాగాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది జాబితా, కమిషనర్, కార్యాలయ కాంట్రాక్ట్ వంటి పూర్తి వివరాలు ఉంటాయి. అంతేకాదు.. పన్ను చెల్లింపులు, ఫిర్యాదులు, ఆన్‌లైన్ సేవలు, పౌరసేవలు, దరఖాస్తు ప్రతాలు, అర్బన్ వైబ్స్, ఇతర సేవలు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ను పరిశీలిస్తున్న ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు.
యాప్‌లో నమోదవుతున్న ఫిర్యాదులు
2025–26 ఆర్థిక సంవత్సరంలో బడ్డీ యాప్ ద్వారా ఇప్పటి వరకు పలు సమస్యలపై 3,362 ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. ఇందులో మొత్తంగా 1,084 సమస్యలు పరిష్కారం కాగా ఇంకా 1,689 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 91 రిజెక్ట్ చేయగా మరో 64 వరకు ఫిర్యాదులు పలుమార్లు తిరిగి వచ్చినట్లుగా గుర్తించారు. మరో 165 ఫిర్యాదులు ఖర్చుతో కూడుకుని ఉన్నవిగా భావించి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తామని సంబంధిత అధికారులు
తెలిపారు.
సత్వరం సేవలు అందించాల్సి ఉండగా..
‘సిటిజన్ బడ్డీ’ యాప్‌లోని గ్రీవెన్స్ విభాగానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శానిటేషన్, మురికి కాలువలు, రోడ్లు, సఫాయిమిత్ర సురక్ష, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, అనధికార, అక్రమ కట్టడాలు, ఉల్లంఘనల నివేదన, ఆదాయం, వీధి వ్యాపారుల సమస్య, ఆహార పరిశుభ్రత, ఇతర సమస్యలన్నీ యాప్‌లో కనిపిస్తాయి. యాప్‌లో నమోదవుతున్న ఫిర్యాదులపై ఆయా విభాగాల అధికారులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సి ఉన్నా ఆదిశగా చర్యలు తీసుకోవడంలేదు. ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కరిస్తామనే సమాచారం ఇవ్వడం, పరిష్కారం అనంతరం ఫిర్యాదుదారుడి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా ఏ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
చర్యలు తీసుకుంటున్నాం
ప్రత్యక్షంగా వచ్చే ఫిర్యాదులతో పాటు ఆన్‌లైన్‌లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తాం. గతంలో గ్రీవెన్స్‌కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా సేవలు అందించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం.
– సంపత్, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్
ఇప్పటి వరకు యాప్‌లో వచ్చిన ఫిర్యాదులు
సిటిజన్ బడ్డీ.. పరిష్కారం లేదండీ!


