మెప్మాపై పట్టింపేది..! | - | Sakshi
Sakshi News home page

మెప్మాపై పట్టింపేది..!

Oct 23 2025 6:25 AM | Updated on Oct 23 2025 6:25 AM

మెప్మ

మెప్మాపై పట్టింపేది..!

ఏడీఎంసీ, డీఎంసీ పోస్టులు ఖాళీ క్యాతన్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌కు మెప్మా పీడీ ఇంచార్జి బాధ్యతలు బల్దియాల్లో రెగ్యులర్‌ టీఎంసీ పోస్టులు ఖాళీ కార్పొరేషన్‌లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన టీఎంసీ, సీవోలు అవకతవకలపై పట్టింపు కరువు

మంచిర్యాలటౌన్‌: జిల్లాలోని బల్దియాల్లో మహిళల ఆర్థిక బలోపేతానికి ఏర్పాటు చేసిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)ను పట్టించుకునే వారే కరువయ్యారు. రూ.కోట్ల రుణాలు బ్యాంకుల నుంచి మహిళా సంఘాలకు అందిస్తుంటారు. రుణాలు ఇప్పించడంలో మెప్మా అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆడిట్‌లో సీ్త్రనిధి రుణాలను మహిళా సంఘాల నుంచి వసూలు చేసిన సిబ్బంది, వాటిని బ్యాంకుల్లో చెల్లించకుండా సొంత అవసరాలకు వినియోగించినట్లు బయటపడింది. మంచిర్యాలలో రూ.56.38 లక్షలు, బెల్లంపల్లిలో రూ.16.50 లక్షలు సొంత అవసరాలకు వాడుకున్నట్లుగా గుర్తించిన అధికారులు రికవరీకి ఆదేశించారు. ఆర్సీల నుంచి మొదలుకుని సీవోలు, టీఎంసీలు రుణాలు ఇప్పించడంతోపాటు రికవరీలో అవకతవకలకు పాల్పడుతున్నా.. వారిపై పర్యవేక్షించాల్సిన ఏడీఎంసీ, డీఎంసీ పోస్టులు ఖాళీగా ఉండడం, రెగ్యులర్‌ మెప్మా పీడీ లేకపోవడం, మున్సిపల్‌ కమిషనర్లకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించడం కారణంగా మెప్మాలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

డబ్బులిస్తేనే రుణాలు..

జిల్లాలో 5,363 స్వయం సహాయక గ్రూపుల్లో 56,130 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సంఘాలకు బ్యాంకు లింకేజి, సీ్త్రనిధి రుణాలు ఇప్పించి, వివిధ యూనిట్ల ఏర్పాటుతో ఆర్థికంగా ఎదిగి రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. రుణాలు ఇప్పించేందుకు జిల్లావ్యాప్తంగా 235 మంది ఆర్పీలు పనిచేస్తున్నారు. వీరు సీవోకు ప్రతిపాదనలు పంపిస్తారు. గ్రూపు సభ్యులు రుణాలు సకాలంలో చెల్లిస్తున్నారో లేదో పరిశీలించి, ఆయా గ్రూపులకు కొత్త రుణాలను సీవో, టీఎంసీలు మంజూరు చేయిస్తారు. రుణంలో నుంచి కొంత మొత్తం తీసుకుంటున్నారని, అది ఇచ్చే వారికే రుణాలు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆర్పీల్లో కొందరిని తమ ఆధీనంలో ఉంచుకుని వసూళ్లకు పాల్పడుతూ, వినని ఆర్పీలను పక్కన పెట్టి, కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక మెప్మా సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆయా మున్సిపాలిటీల ఆర్పీలు, టీం సభ్యులు మున్సిపల్‌ కమిషనర్లకు ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం.

ఎక్కడి సిబ్బంది అక్కడే

జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో టీఎంసీలు, సీవోలు ఏళ్ల తరబడి ఒక్కచోటే పనిచేస్తున్నారు. మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలో టీఎంసీతోపాటు ముగ్గురు సీవోలు కొన్నేళ్లుగా పని చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో రెగ్యులర్‌ టీఎంసీ పనిచేస్తుండగా, ఒక్క సీవో గాని, ఇతర సిబ్బంది గాని లేరు. లక్సెట్టిపేట, నస్పూరు, మందమర్రి, చెన్నూరులో సీవోకు టీఎంసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల మినహా ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ పూర్తిస్థాయి సిబ్బంది లేక ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. మంచిర్యాలలో 56 మంది ఆర్పీలు పనిచేస్తుండగా, చెప్పినట్లుగా వినే ఆర్పీలకు సంబంధించిన గ్రూపు సభ్యులకు బ్యాంకు రుణాలు ఇప్పించి కమీషన్‌ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు కమిషనర్‌కు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.

ఫిర్యాదు చేస్తే చర్యలు

తీసుకుంటాం

జిల్లాలోని మెప్మాలో కొందరు ఆర్పీలు, సీవోలు, టీఎంసీల పనితీరుపై ఫిర్యాదులను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయడంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి, మంచిర్యాలలో రెగ్యులర్‌ టీఎంసీ ఉండగా, నస్పూరు, లక్సెట్టిపేట, చెన్నూరు, మందమర్రి మున్సిపాలిటీల్లో ఉన్న ఒక్క సీవోలకు టీఎంసీగా అదనపు బాధ్యతలు అప్పగించాం. మెప్మాలో ఏ అధికారి నుంచి ఇబ్బందులు ఉన్నా వెంటనే తనకు ఫిర్యాదు చేస్తే విచారించి శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. – రాజు, మెప్మా పీడీ

(క్యాతన్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌)

జిల్లాలోని మున్సిపాలిటీల వారీగా మహిళా సంఘాలు, సంఘ సభ్యులు

మున్సిపాలిటీ ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఆర్పీలు

గ్రూప్‌లు

బెల్లంపల్లి 842 8,743 33

చెన్నూరు 414 4,563 19

క్యాతన్‌పల్లి 563 5,950 23

లక్సెట్టిపేట 350 3,618 17

మంచిర్యాల 1306 13,310 56

మందమర్రి 856 9,005 38

నస్పూర్‌ 1032 10,941 49

మొత్తం 5,363 56,130 235

మెప్మాపై పట్టింపేది..!1
1/1

మెప్మాపై పట్టింపేది..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement