విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించొద్దు
తాండూర్: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. బుధవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వచ్చిన సమయంలో అధికారులు అందుబాటులో లేరు. కొద్దిసేపు వేచి చూసిన తర్వాత అధికారులు రావడంతో రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూ భారతి దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన ఆదివాసీ కొలవార్ రైతులు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని వెంకయ్యపల్లి శివారు సర్వేనంబర్ 12లోని 34 ఎకరాల భూమిని గత మూడు దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్నామని, అటవీ శా ఖ అధికారులు అడ్డుకుంటున్నారని, పోడు పట్టాలు వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్ స్పందిస్తూ అధికారులతో విచారణ చేయిస్తానని తెలిపారు. తహసీల్దార్ జ్యోత్స్న పాల్గొన్నారు.


