
● రూ.60కోట్లపైనే సాగిన అన్ని రకాల వ్యాపారం ● గుడిపేట లి
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/మంచిర్యాలక్రైం: దసరా జోష్ జోరుగా సాగింది. ఈ ఏడాది దసరా రోజు గాంధీ జయంతి ఉండడం, గురువారమూ కావడంతో మూడు రోజుల పండుగగా మారింది. బుధ, గురు, శుక్రవారాల్లోనూ సందడి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు రూ.60కోట్లకు పైగా ఖర్చు చేసి సంబరంగా పండుగ చేసుకున్నారు. మద్యం, మాంసం, నూతన వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, మిఠాయిలు తదితర కొనుగోళ్లకు భారీగా ఖర్చు చేశారు.
అంచనాకు మించి మద్యం అమ్మకాలు
ఈసారి దసరా పండుగ గాంధీ జయంతి రోజు రావడంతో ఆశించిన స్థాయిలో మద్యం అమ్మకాలు ఉండవని ఎకై ్సజ్ అధికారులు అంచనా వేశారు. కానీ ఆ అంచనాను దాటి మద్యం అమ్మకాలు సాగినట్లు ఓ అధికారి చెప్పడం గమనార్హం. మందుబాబులు ముందస్తుగానే మద్యం కొనుగోలు చేశారు. జిల్లాలో గత దసరాకు మూడు రోజుల్లో దాదాపు రూ.20.84 కోట్ల వరకు వ్యాపారం సాగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28, 29, 30న మంచిర్యాల జిల్లా గుడిపేట లిక్కర్ డిపో నుంచి మొత్తంగా రూ.26.38 కోట్ల వరకు మద్యం సరఫరా జరిగిందంటే ఏ స్థాయిలో అమ్మకాలు జరిగాయో తెలుస్తోంది. డిపో పరిధిలో పెద్దపల్లి జిల్లా రామగుండం, మంథని, భూపాలపల్లి జిల్లా కాటారం, జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతాల్లో 135 మద్యం దుకాణాలు, 28 బార్లు ఉండగా నిత్యం ఇక్కడి నుంచి మద్యం నిల్వలు సరఫరా అవుతాయి. మూడు రోజుల్లో 23,679 లిక్కర్ కేసులు, 30,855 బీర్ కేసులు అమ్మగా.. వీటి విలువ రూ.26.38 కోట్లు ఉంటుందని డిపో అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా పరిధిలో 73 మద్యం దుకాణాలు, 18 బార్లు ఉండగా.. గత ఏడాది రూ.8.04కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈసారి దసరాకు రూ.14.16కోట్ల మ ద్యం అమ్మకాలు జరిగాయి. దసరాకు ఒక్క రోజు ముందు ఈ నెల ఒకటిన ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా రూ.10కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.
మాంసం అమ్మకాలు
మాంసం అమ్మకాలూ జోరుగానే సాగాయి. గ్రామాలు, పట్టణాల్లో కలిపి వేల సంఖ్యలో యాటలు(మేకలు, మేకపోతులు, గొర్రె పోతులు) తెగినట్లు తెలుస్తోంది. మంచిర్యాల, సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలో దాదాపు రూ.15 కోట్ల వరకు వ్యాపారం సాగినట్లు తెలుస్తోంది. దసరా గాంధీ జయంతి రోజు కావడంతో బుధ, గురు, శుక్రవారాల్లో మటన్, చికెన్ అమ్మకాలు పోటాపోటీగా సాగాయి. కిలో చికెన్ రూ.200, స్కిన్‌లెస్ రూ.220, మటన్ కిలో రూ.700 నుంచి రూ.1,000 ఉండగా ఒక్కో మేక, గొర్రె, మేకపోతులకు రూ.7 వేల నుంచి రూ.16 వేల వరకు ధరలు పలికాయి.
నూతన వస్త్రాలు.. వాహనాలు..
బట్టల దుకాణాలు, షాపింగ్ మాల్స్‌తోపాటు ఎలక్ట్రానిక్స్, హోం అప్లయెన్సెస్, వాహన కొనుగోళ్లు తదితర వ్యాపారాలు కూడా జోరుగా సాగినట్లు తెలుస్తోంది. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా రూ.15 కోట్లకు పైగానే వస్త్ర వ్యాపారం జరుగగా ఎలక్ట్రానిక్, హోం అప్లయెన్స్‌స్ దుకా ణాలు, మిఠాయిలు, కూల్‌డ్రింక్స్ వ్యాపారం, ద్విచక్ర వాహన, కార్ల కొనుగోళ్లు బాగానే జరగాయి. ఇక మొబైల్ దుకాణాలు రూ.లక్షల్లో వ్యాపారం చేశాయి. దసరా సందడితో అన్ని రకాల వ్యాపారాలన్నీ రూ.20 కోట్ల వరకు జరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏదేమైనా దసరా సంబురాలకు తగ్గేదేలే అన్న చందంగా జోష్ కనిపించింది.

● రూ.60కోట్లపైనే సాగిన అన్ని రకాల వ్యాపారం ● గుడిపేట లి