
కొత్త గనుల ఏర్పాటుకు కృషి
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. స్థానిక సింగరేణి హైస్కూల్ మైదానంలో సింగరేణి, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సప్తవ్యసనాల దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం రాధాకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్యతో కలిసి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త గనుల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడి త్వరగా వేలంపాట నిర్వహించే విధంగా చూడాలని కోరినట్లు తెలిపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల కనీస వేతనం, కార్మికుల సొంతింటి కల నెరవేర్చే విధంగా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు, సింగరేణి కార్మిక కుటుంబాలు పాల్గొన్నారు.
అమ్మ దీవెనలతో ప్రజలు ఆనందంగా ఉండాలి
చెన్నూర్: దుర్గాదేవి అమ్మవారి దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. దసరా పండుగ సందర్బంగా గురువారం చెన్నూర్‌లోని దుర్గాదేవి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో సుమారు రూ.300 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో చెన్నూర్, కోటపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించారు.