
భూఆక్రమణ అడ్డగింత
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఖాళీ స్థలం ఆక్రమణ యత్నాన్ని స్థానిక యువకులు, మహిళలు అడ్డుకున్నారు. దీంతో సింగరేణి అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చి వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పట్టణ నడిబొడ్డున ఉన్న రూ.కోట్లు విలువై చేసే సింగరేణి లీజు భూమిలో ఓ సామాజిక వర్గానికి చెందిన శ్రేణులు బుధవారం రాత్రి గుట్టుగా చదును చేసి పిచ్చిమొక్కలు తొలగించారు. ఇప్పటికే ఆ సామాజిక వర్గానికి ఫంక్షన్‌హాల్, కులదైవం గుడిని సింగరేణి లీజు స్థలంలో నిర్మించుకోగా కొత్తగా ప్రహరీ ఆనుకుని అర ఎకరానికి పైగా ఉన్న భూమిని ఆక్రమించడం కలకలం రేపింది. మూసివేతకు గురైన సౌత్‌క్రాస్‌కట్ గని ఉపరితలంలో ఇంకా మూడెకరాలకు పైగా సింగరేణి లీజు భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన కొందరు అర్ధరాత్రి ట్రాక్టర్‌తో పిచ్చిమొక్కలు తొలగించి గుడి ముందున్న ప్రహరీ కొంత తొలగించి కొత్తగా గేటు ఏర్పాటు చేశారు. సిమెంటు గద్దె నిర్మించి విగ్రహాలు నెలకొల్పి ఆధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం సదరు సామాజిక వర్గానికి చెందిన మహిళలు, వక్తలు ప్రత్యేక పూజలు చేశారు. ఆ విషయమై 31వ వార్డు యువకులు, మహిళలు సింగరేణి అధికారులకు సమాచారం అందించారు. సామాజిక మాధ్యమాల్లో భూ ఆక్రమణ ఫొటోలు పోస్టు చేయడంతో చర్చనీయాంశమైంది. మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ఆదేశాలతో సింగరేణి ఎస్టేట్, సింగరేణి అటవీ శాఖ, ఎస్‌అండ్‌పీసీ అధికారులు, సిబ్బంది వచ్చి భూ ఆక్రమణ చర్యలను అడ్డుకున్నారు. చదును చేసిన ఖాళీ స్థలంలో ఆక్రమణలను బ్లేడ్ ట్రాక్టర్‌తో తొలగించారు. ఆక్రమణకు గురికాకుండా మొక్కలు నాటారు. సదరు భూమి సింగరేణి కంపెనీదని, కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటామని రెండు చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మరెవరైనా భూ కబ్జా చేస్తే పేదలతో నివాస గృహాలు ఏర్పాటు చేయిస్తామని 31వ వార్డు ప్రజలు సింగరేణి అధికారులకు తెగేసి చెప్పారు. వార్డు యువకులకు కాంగ్రెస్, సీపీఐ, బీఆర్‌ఎస్ శ్రేణులు మద్దతుగా నిలిచారు.