
ఖర్చుకు తొందరొద్దు
పోటీలో ఉంటామనే ధీమాతో వ్యయం
దసరా పండుగ రోజు పల్లెల్లో ఆశావహుల సందడి
స్థానిక సంస్థల ఎన్నికల ముందే హడావుడి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహులు హడావుడి చేస్తున్నారు. ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలూ దృష్టి సారించాయి. ఈసారి బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు ఈ నెల 8న విచారణకు రానుంది. ఈ క్రమంలో కోర్టు తీర్పు ఎలా వస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. కానీ.. కొందరు ఎన్నికలు జరుగుతాయనే ధీమాతో ఉండగా.. మరికొందరు జరిగే అవకాశం లేదని వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోటీ చేయాలనుకునే కొందరు నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల నాయకత్వం ఎన్నికలు జరిగితే అందుకు సిద్ధంగా ఉండాలని, పోటీలో వె నుకబడకూడదనే కారణంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. మండల, జిల్లా స్థాయి నాయకులు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ముందే స్థానంపై కర్చీఫ్ వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ముఖ్యులతో టచ్‌లో ఉంటూ తమకే సీటు దక్కేలా ప్రయత్నాలతో హడావుడి చేస్తున్నారు.
తొందరపడితే అంతే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించిన రిజర్వేషన్లపై ఓ వైపు హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే.. అభ్యర్థులకు పోటీపై స్పష్టత రాకముందే కొందరు దసరా పండుగకు డబ్బులు ఖర్చు చేసుకున్నారు. ఎలాగైనా పోటీ చేస్తామని చెప్పుకుంటూ దావత్‌లు ఇచ్చారు. మద్యం బాటిళ్లు తమ అనుకూలమైన వారికి పంపిణీ చేసుకున్నారు. ఇంకా నోటిఫికేషన్ రాకముందే డబ్బులు ఖర్చు చేసుకోవద్దంటూ అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాకముందే పోటీ చేస్తామనే నమ్మకంతో పైసలు ఖర్చు చేసుకుంటున్నారు. ఒకవేళ ఆశించిన చోట పోటీ కుదరకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కోర్టు తీర్పుతో రిజర్వేషన్ల మార్పుతోపాటు షెడ్యూల్ మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎన్నికల కోసం తొందరపడి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని రాజకీయ అనుభవజ్ఞులు చెబుతున్నారు.
స్పష్టత వస్తేనే..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లపై న్యాయస్థానం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయోననే సర్వత్రా ఎదురు చూస్తున్నారు. గతంలో కంటే బీసీ వర్గాలకే ఈసారి అధికంగా అవకాశాలు వచ్చాయి. బీసీ నాయకులకు జనాభా ప్రాతిపదికన పోటీకి అవకాశం కల్పించారు. ఒకవేళ కోర్టులో 42శాతం రిజర్వేషన్ల కల్పన విధానం నిలబడకపోతే బీసీ అభ్యర్థులపై ప్రభావం పడనుంది. అంతేకాక మహిళా కోటా, జనరల్ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో మరో నాలుగు రోజులపాటు వేచి చూసి ముందుకు వెళ్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.