
వామ్మో...దోమ!
మంచిర్యాల కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు రెండే ఫాగింగ్ యంత్రాలు కోట్ల నిధులున్నా కానరాని దోమల నివారణ చర్యలు వరద ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్‌తోనే సరి జ్వరాల బారిన పడుతున్న నగర వాసులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలో దోమలను నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గతంలో మంచిర్యాల 36 వార్డులతో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ప్రతీ వార్డులో నెలకు రెండుసార్లు ఫాగింగ్ చేయడంతో పాటు, పారిశుద్ధ్య పనులు చేపట్టి, బ్లీచింగ్ పౌడర్ చల్లేవారు. ప్రస్తుతం కార్పొరేషన్‌గా మారడం నస్పూర్‌తో పాటు, హాజీపూర్ మండలంలోని 8 గ్రామాలు విలీనం కావడంతో 60 డివిజన్లుగా మారింది. పరిధి పెరగడం, ఫాగింగ్ యంత్రాలు సరిపడా లేకపోవడం, ఉన్న వాటిని వినియోగించక పోవడంతో నెలల తరబడి పలు డివిజన్లలో ఫాగింగ్ చేపట్టడం లేదు. ఫలితంగా కార్పొరేషన్ పరిధిలో ఇంటికో జ్వర బాధితులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దగ్గు, జలుబు, జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కార్పొరేషన్ అధికారులు చేపట్టాల్సిన పనులను పట్టించుకోక పోవడంతో ప్రజలు డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు.
ఫాగింగ్ యంత్రాలేవి?
మంచిర్యాల నగరపాలక సంస్థకు అవసరమైన ఫాగింగ్ యంత్రాలను సమకూర్చుకోవడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. 60 డివిజన్లకు కేవలం మూడు ఫాగింగ్ యంత్రాలే ఉండగా అందులో ఒకటి పనిచేయడం లేదు. రెండు యంత్రాలతో 60 డివిజన్లలో ఫాగింగ్ చేసినా నెలకు కేవలం ఒక్కసారి మాత్రమే ఒక డివిజన్‌లో చేసేందుకు అవకాశం ఉంది. ఈ వర్షాకాలంలో కనీసం ఒక్కసారి కూడా ఫాగింగ్ చేయని డివిజన్లు సగానికి పైగా ఉన్నాయి. శివారు ప్రాంతాలు, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్న కాలనీల్లో వారంలో కనీసం ఒక్కసారైనా ఫాగింగ్ చేస్తేనే దోమలను నివారించేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవల గోదావరి వరద పోటెత్తి మంచిర్యాలలోని ఎన్టీఆర్‌నర్ కాలనీ, రాంనగర్, పద్మశాలి కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. కనీసం ఆయా ప్రాంతాల్లోనైనా ఫాగింగ్ చేయాల్సి ఉన్నా కేవలం బ్లీచింగ్ పౌడర్ చల్లి వదిలేశారు. దీంతో ఈ కాలనీల్లో దోమల బెడద గతంలో కంటే మరీ ఎక్కువగా ఉందని కాలనీ ప్రజలు వాపోతున్నారు. దోమల నివారణ కోసం ప్రభుత్వం ఏటా రూ.లక్షల్లో నిధులు వెచ్చిస్తున్నా ప్రజలకు మాత్రం వాటి బెడద తప్పడం లేదు. ప్రధానంగా డ్రెయినేజీలు, ఖాళీ స్థలాలు, ముళ్ల పొదలు, వ్యర్థాలు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందుతున్నాయి.
దోమల స్వైరవిహారం
ప్రస్తుతం నగరంలోని ఏ వీధికి వెళ్లినా దోమల గురించే మాట్లాడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నగరవాసుల్ని ఎడాపెడా కుట్టేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. ఈగల సైజులో ఉన్న దోమలు స్వైరవిహారం చేస్తూ జనం రక్తాన్ని పీల్చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే నగరపాలక సంస్థ అధికారులు, ప్రత్యేక అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. గతంలో పాలక వర్గం ఉన్నప్పుడు వార్డుల్లోని ప్రజలు కౌన్సిలర్లతో మాట్లాడి ఫాగింగ్ చేపట్టేలా చేసుకునేవారు. పాలకవర్గం గడువు తీరడంతో ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలన అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోగా పొద్దంతా ఎండ, ఉక్కపోత, సాయంత్రం చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు దోమలు జనం మీద దండెత్తుతున్నాయి. వర్షాకాలానికి ముందే గతంలో సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జూన్ నెలలోనే డ్రెయినేజీల్లోని పూడికతీత చేపట్టేవారు. ఈ ఏడాది మాత్రం జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక పేరిట పారిశుద్ధ్యంతో పాటు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచి, డ్రెయినేజీల్లోని పూడికతీత, ఖాళీ స్థలాల్లోని పిచ్చి మొక్కల తొలగింపు, నిల్వ నీటిని తొలగించే పలు కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. కానీ మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలో ఈ వంద రోజుల ప్రణాళిక పేరిట ఎలాంటి కార్యక్రమాలను చేపట్టక పోవడం కూడా దోమలు వృద్ధి చెందేందుకు దోహదంగా మారింది.
ఫాగింగ్ చేపడతాం
మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో ఫాగింగ్ చేపడుతున్నాం. అన్ని డివిజన్లలోనూ ఫాగింగ్ చేసేలా చూస్తాం. దోమల నివారణకు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. చెత్తను తొలగించడంతో పాటు డ్రెయినేజీల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలం పూర్తయ్యే వరకు నిరంతరం ఫాగింగ్ చేపడుతాం.
– సంపత్ కుమార్, కమిషనర్, మంచిర్యాల

వామ్మో...దోమ!