
● ఒక్క బస్తా కోసం మూడు గంటలు నిరీక్షణ ● అధికారులపై రైతు
నెన్నెల/చెన్నూర్‌రూరల్: జిల్లాలోని రైతులకు యూరియా కష్టాలు తీరడంలేదు. నెన్నెల సహకార సంఘానికి శనివారం 222 యూరియా బస్తాలు రావడంతో ఏవో సృజన, పీఏసీఎస్ సిబ్బంది నందులపల్లి, గొల్లపల్లి, గన్‌పూర్ గ్రామాల రైతులకు టోకెన్‌లు పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. మూడుగంటల పాటు క్యూలో నిలబడి టోకెన్ పొందారు. ముందు వరుసలో ఉన్నవారికే టోకెన్లు అందగా మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. అనంతరం ఒక్క యూరియా బస్తా కోసం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాంకు వెళ్లారు. గంటల తరబడి క్యూలో ఉండి ఇబ్బంది పడ్డారు. తీరా ఒక్కోబస్తా చొప్పున ఇవ్వడంతో సరిపోదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడా యూరియా ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చెన్నూర్ మండలంలోని ఆస్నాద, నాగాపూర్ గ్రామాలకు 222 చొప్పున యూరియా బస్తాలు వచ్చాయి. నాగాపూర్‌లో పోలీసు పహారా మధ్య బ్యాగులు పంపిణీ చేశారు. ఆస్నాద రైతు వేదిక వద్ద పంపిణి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 600ల మంది రైతులు వచ్చి యూరియా కావాలని ఆందోళన చేపట్టడంతో పంపిణీని నిలిపి వేశారు.