
లోక్ అదాలత్‌లో 3,572 కేసులు పరిష్కారం
మంచిర్యాలక్రైం: జిల్లాలోని వివిధ కోర్టు ప్రాంగణాల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదా లత్‌లో 3,572 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని లక్సెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు తెలిపారు. 3,100 సైబర్ క్రైమ్, 339 క్రిమినల్, 30 సివిల్, 15 వాహనాల పరిహారం, 43 ఫ్రీ లిటిగేషన్, 45 ఇతర కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.నిర్మల, సీనియర్ సివిల్ జడ్జి రాంమోహన్‌రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జీలు కవిత, నిరోష, కృష్ణతేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాల్గొన్నారు.
న్యాయదేవత సాక్షిగా మళ్లీ ఒక్కటయ్యారు..
జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు క్షణికావేశంలో పోలీస్‌స్టేషన్ మెట్టెక్కారు. పోలీస్ అధికారులు, కులపెద్దలు శతవిధాలుగా ప్రయత్నించినా ససేమి రా అంటూ విడిపోవాల్సిందేనని కోర్టు మెట్లెక్కారు. మూడేళ్లపాటు కోర్టుచుట్టూ తిరిగారు. చివరికి శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో జిల్లా జడ్జి వీరయ్య కౌన్సిలింగ్ ఇవ్వడంతో న్యాయదేవత సాక్షిగా మళ్లీ ఒక్కటయ్యారు. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.