
సొంతింటికే కార్మికుల మొగ్గు
శ్రీరాంపూర్: కార్మికులు సొంతింటి పథకానికే మొగ్గు చూపుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. కార్మికులకు కంపెనీ క్వార్టర్ కావాలా? సొంతింటి పథకం కావాలా అనే దానిపై గురు, శుక్రవారాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా గనులపై బ్యాలెట్ పత్రాలతో కార్మికుల అభిప్రాయాలు సేకరించారు. శ్రీరాంపూర్ ఏరియా బ్యాలెట్ పత్రాలను శుక్రవారం నస్పూర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో లెక్కించారు. 60శాతం మంది కార్మికులు బ్యాలెట్ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఇందులో 4543 మంది సొంతింటి పథకం కావాలని, 31 మంది కంపెనీ క్వార్టరే కావాలని ఓటేశారని తెలిపారు. కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో వచ్చిన అభిప్రాయాలను యాజమాన్యానికి త్వరలోనే సమర్పిస్తామని తెలిపారు. 40ఏళ్లు కంపెనీలో సర్వీసు చేసిన కార్మికులు రిటైర్డ్ తర్వాత సొంతిళ్లు కూడా కట్టుకోలేకపోతున్నారన్నారు. యూనియన్ బ్రాంచీ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, నాయకులు వెంగళ శ్రీనివాస్, తోడే సుధాకర్, పెర్క సదానందం, శ్రీపతి బానేశ్, కిషన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మిడివెల్లి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.