
వయోజనులు చదవాలి.. రాయాలి
కోటపల్లి: ప్రతి ఒక్కరూ కనీస విద్యాజ్ఞానం కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఉల్లాస్ పథకంలో భాగంగా వయోజన విద్యాశాఖ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనుంది. నవభారత్ సహకారంతో ఈ కార్యక్రమం దసరా వరకు ప్రారంభం కానుంది. డీఆర్‌డీఏ సెర్ప్ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులు, మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి నివేదిక అందజేశారు. జిల్లాలో 15ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్యలో 30,636మంది నిరక్షరాస్యులను గుర్తించారు. శిక్షణ ఇవ్వడానికి 3,064మంది వాలంటీర్లను ఎంపిక చేసి మండలాల వారీగా శిక్షణ కూడా పూర్తి చేశారు. విధి విధానాలను సెర్ప్ అధికారులు సమగ్రంగా వివరించారు. ప్రతీ గ్రామ పంచాయతీ నుంచి ఇద్దరు రిసోర్స్‌పర్సన్లు, ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వగా స్వచ్ఛందంగా బోధనకు ముందుకొచ్చే వారికి శిక్షణ ఇస్తారు. సామాజిక సాధికారతలో భాగంగా చదువురాని వారికి చదవడం, రాయడం నేర్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యుల్లో 50శాతం మంది మాత్రమే సంతకం చేస్తున్నారని, మిగతా వారు వేలిముద్ర వేస్తున్నారనే సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. దీంతో వయోజన మహిళలకు చదువు నేర్పడమే కాకుండా మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి నేరుగా ఓపెన్ పది, ఆసక్తి ఉంటే ఓపెన్ ఇంటర్, డిగ్రీ వరకు చదివిస్తారు. ఆ తర్వాత వారికి స్కిల్ డెవలప్‌మెంటు టెక్నికల్ కోర్సులు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. బ్యాకింగ్ రంగంలో అర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర ఆంశాలు నేర్పిస్తారు.
వాలంటీర్ల బోధన
స్వచ్ఛందంగా బోధన చేసేవారి వీలు ఆధారంగా మండలంలో ఎంచుకున్న ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు, పంచాయతీలు, కమ్యూనిటీ భవనాలు, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తారు. 15నుంచి 20మంది చొప్పున గ్రూపులు ఏర్పాటు చేస్తారు. మహిళా సంఘాల్లో అక్షరాస్యులైన వారిని ఎంపిక చేసి నిరక్షరాస్యుల గ్రూపులను కేటాయించి వారికి చదువు చెప్పిస్తారు. గ్రూపులో ఉన్న సభ్యులకు చదవడం, రాయడం వచ్చే వరకు చదువు చెప్పే బాధ్యత వాలంటీర్లకు అప్పగించారు. విద్యాశాఖ పుస్తకాలతోపాటు ఉపాధ్యాయుల ద్వారా సహకారం అందిస్తారు. తల్లి చదవడం ద్వారా అ కుటుంబంలో వెలుగు నిండుతుంది. తద్వారా బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరగడంతోపాటు డ్రాపౌట్ తగ్గి బాల్య వివాహాలపై అవగాహన పెరుగుతుంది. గ్రామంలో అక్షరాస్యులు ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధిలో పయనించేందుకు దోహదడపతుంది.