
యూడైస్ ప్లస్‌కు ఆటంకాలెన్నో..!
మంచిర్యాలఅర్బన్: యూడైస్ ప్లస్ పోర్టల్‌లో విద్యార్థుల వివరాల నమోదుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సమాచార పారదర్శకత.. అన్ని రాష్ట్రాల స్టూడెంట్ సెంట్రల్ గవర్నమెంటు ఒకే పోర్టల్‌లో ఉండాలని యూడైస్ ప్లస్ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ చేపట్టింది. ప్రతీ పాఠశాలలోని ప్రతీ విద్యార్థి వివరాలు నమోదు చేయాల్సి ఉంది. నమోదు చేయకపోతే విద్యార్థులకు స్కాలర్‌షిప్, సర్టిఫికేట్ జారీ, పలు సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యాశాఖలో ఎన్ని యాప్‌లు వచ్చినా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ అంతంతగానే ఉంది. విద్యార్థుల వివరాలు నమోదు ప్రక్రియ వేగవంతంగా చేయాల్సి ఉండగా నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 1,25,683 మంది విద్యార్థులకు గాను 1,19,354 మంది ఆధార్‌కార్డులు సమర్పించగా.. 6329 మంది ఆధార్‌కార్డులు సమర్పించలేదు.
కారణాలు అనేకం..?
విద్యార్థుల వివరాలు పోర్టల్‌లో నమోదు కాకపోవడానికి అనేక కారణాలున్నాయి. కొత్తగా చేరిన విద్యార్థుల్లో చాలామంది వివరాలు ఆధార్‌కార్డు, సర్టిఫికేట్‌లో వేర్వేరుగా ఉండడం కూడా ఇబ్బందిగా మారుతోంది. ఇదివరకు ఎల్‌కేజీ, యూకేజీలో ఆధార్‌కార్డు లేకపోయినా విద్యార్థుల వివరాలు పోర్టల్ నమోదుకు అవకాశం ఉండేది. ఆధార్ తప్పనిసరి కావడంతో ఎంట్రీ కావడం లేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల వివరాల నమోదులో అనాసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో ఎలాంటి వివరాలు అందుబాటులో లేని విద్యార్థులు అడ్మిషన్లు పొందడం.. ఇతర జిల్లాలకు చెందిన వారు కావడం కూడా నమోదు ప్రక్రియకు అవాంతరంగా మారినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో ఓ సర్కారు పాఠశాలలో 830 మంది, మందమర్రిలో 651 మంది విద్యార్థులు ఆధార్డుకార్డులు సమర్పించలేదంటే నమోదు ఏవిధంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఒకేచోట అన్ని వివరాలు..
విద్యార్థుల పూర్తి సమాచారం తెలిసే యూడైస్ ప్లస్ డాటా ఎంట్రీపై కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాఠశాల పేరు, మండలం, విద్యార్థి పూర్తి పేరు, తల్లిదండ్రులు, కులం, మాట్లాడే భాష, పుట్టిన ఊరు, ప్రస్తుత నివాసం, పుట్టినతేదీ, ప్రస్తుత పాఠశాల, పూర్వ పాఠశాల, ఏ సంవత్సరం ఎక్కడ చదివారు, మాధ్యమం, బ్లడ్‌గ్రూప్, ఎత్తు, బరువు, పాఠశాల ఇంటికి ఎంత దూరం, విద్యార్థుల బ్యాంకుఖాతాలతోపాటు పలు అంశాలను పొందుపర్చాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాలు చూపుతూ ప్రైవేట్ యాజమాన్యాలు తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. కళాశాలలు యాజమాన్యాలు పాఠశాలలకు సంబంధించినదంటూ తప్పించుకుంటున్నారు. యూడైస్ నంబరు ఆధారంగానే స్కాలర్‌షిప్‌లు కూడా మంజూరయ్యే వీలుంది. యూడైస్ ప్లస్ సెంట్రల్ పోర్టల్ నమోదు చేయడం వల్ల విద్యార్థి ఎక్కడ చదువుతున్నది ఇట్టే తెలిసిపోనుంది. తద్వారా సర్టిఫికేట్లు జారీ కూడా సులువు కానుంది. ఆధార్‌కార్డులేని విద్యార్థులకు ఆధార్‌కార్డులు ఇప్పించడం.. యూడైఎస్‌ప్లస్ పోర్టల్‌లో నమోదుపై అధికారులు, టీచర్లు దృష్టి సారిస్తేనే విద్యార్థులకు మేలు జరుగనుంది.
ఆధార్ సమర్పించని విద్యార్థులు
బెల్లంపల్లి మండలంలో 436 మంది, భీమినిలో 184, భీమారంలో 143, చెన్నూర్‌లో 452, దండేపల్లిలో 258, హాజీపూర్‌లో 152, జైపూర్‌లో 208, జన్నారంలో 533, కన్నెపల్లిలో 311, కాసిపేటలో 219, కోటపల్లిలో 528, లక్సెట్టిపేటలో 278, మంచిర్యాలలో 830, మందమర్రిలో 651, నస్పూర్‌లో 255, నెన్నెలలో 280, తాండూర్‌లో 368, వేమనపల్లిలో 243మంది ఉన్నారు.