
ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలోపేతం
మంచిర్యాలటౌన్: ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలోపేతం దిశగా రాష్ట్ర, జాతీయ నాయకత్వం ముందుకు వెళ్తోందని, అందులో భాగంగానే మంచిర్యాలకు చెందిన రఘునాథ్ వెరబెల్లిని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమై మొదటిసారిగా శుక్రవారం మంచిర్యాలకు వచ్చిన రఘునాథ్‌కు ఆ పార్టీ నాయకులు ఇందారం వద్ద ఘన స్వాగతం పలికారు. నగరంలో ర్యాలీ అనంతరం కాలేజీరోడ్డులోని పద్మనాయక ఫంక్షన్‌హాల్ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నగేశ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లనే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ భయపడుతుందని విమర్శించారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని, దళారులతో బ్లాక్ మార్కెట్‌కు తరలించి రైతులను దోచుకుంటోందని ఆరోపించారు. రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ బీజేపీ పోరాట ఫలితంగానే మంచిర్యాలలో వందే భారత్ రైలుకు హాల్టింగ్ కల్పించారని, స్థానిక ఎంపీ తనే చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, గోనె శ్యాంసుందర్‌రావు, కొయ్యల ఏమాజి, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, పెద్దపల్లి పురుషోత్తం, మున్నారాజా సిసోడియా, గాజుల ముఖేశ్‌గౌడ్, జోగుల శ్రీదేవి, ముత్తె సత్తయ్య, కమలాకర్‌రావు, పట్టి వెంకటకృష్ణ, అక్కల రమేశ్, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి పాల్గొన్నారు.