
ఎస్బీఐ–2లో బంగారు ఆభరణాలు రికవరీ
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ–2 బ్రాంచిలో జరిగిన భారీ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చోరీకి గురైన బంగారు ఆభరణాలను పోలీసులు పూర్తిగా రికవరీ చేయడంతో కథ ముగిసింది. బంగారం బ్యాంక్‌కు చేరడంతో ఆందోళనకు గురైన బాధితులకు ఊరటనిచ్చింది. గురువారం జైపూర్ ఏసీపీ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. చెన్నూర్ ఎస్బీఐ–2 బ్రాంచిలో గతనెల 23న క్యాషియర్‌గా పని చేస్తున్న నరిగే రవీందర్‌తోపాటు మరికొందరు 20.250 కిలోల బంగారు ఆభరణాలు మాయం చేశారని రీజినల్ మేనేజర్ రితేశ్‌కుమార్ గుప్తా ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గతనెల 31న ప్రధాన నిందితుడి, 44 మందిపై కేసు నమోదు చేసి 15.237 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝూ వెల్లడించారు. ఏ–1 నరిగే రవీందర్, ఏ4, కొంగండి బీరేశ్, ఏ5 కోదాటి రాజశేఖర్‌ను కస్టడీకి తీసుకుని విచారించాం. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ మంచిర్యాల, ముత్తూట్ ఫిన్‌క్రాప్ మంచిర్యాల, చెన్నూర్, మణప్పురం మంచిర్యాలలోని రెండు బ్రాంచ్‌లతోపాటు ముత్తూట్ మనీ బ్రాంచ్ చెన్నూర్‌లలో 5.250 కిలోల బంగారు నగలను రికవరీ చేశాం. గతంలో చేసినని, గురువారం రికవరీ చేసిన బంగారం పూర్తిస్థాయిలో 20.250 కిలోల నగలను రికవరీ చేశామని తెలిపారు. ఈ గోల్డ్‌ను కోర్టు డిపాజిట్ చేస్తుందని డీసీపీ తెలిపారు. త్వరలో బ్యాంక్ అధికారులు బాధితులకు అప్పగిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్, శ్రీరాంపూర్ సీఐలు దేవేందర్‌రావు, వేణుచందర్, ఎస్సైలు శ్వేత, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.
పోలీసు అధికారులకు అభినందన
చెన్నూర్ ఎస్బీఐ–2 బ్రాంచిలో మాయమైన బంగారు నగలను 21 రోజుల్లో ఛేదించిన పోలీసులను సీపీ అంబర్ కిశోర్‌ఝా అభినందించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు దేవేందర్‌రావు, బన్సీలాల్, వేణుచందర్, బాబురావు, ఎస్సైలు సుబ్బారావు, శ్రీధర్, రాజేందర్, శ్వేత, సంతోశ్, లక్ష్మీప్రసన్న, కోటేశ్వర్, మధుసూదన్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుళ్లు రవి, రమేశ్, ప్రతాప్, తిరుపతి లింగమూర్తిలకు అభినందనలు తెలిపారు.