
ఎస్వో, సెక్టోరియల్ అధికారిని సస్పెండ్ చేయాలి
నార్నూర్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ నాసిరకం సరుకులు వాడుతూ అన్నంలో పురుగులు వస్తున్నా పట్టించుకోని నార్నూర్ కేజీబీవీ ప్రత్యేక అధికారి హిమబిందు, జిల్లా సెక్టోరియల్ (జీసీడీవో) అధికారి ఉదయశ్రీలను సస్పెండ్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాల ప్రధాన గేటు ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం పులిహోరలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. వారితో మాట్లాడటానికి వెళ్లిన ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులను అనుమతి లేదని ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. ఎస్సై అఖిల్‌తో వాగ్వాదానికి దిగారు. ఆదివాసీ గిరిజన విద్యార్థినులకు అన్యాయం జరిగితే ప్రశ్నించవద్దా? అంటూ నిలదీశారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందూర్ దాదిరావు మాట్లాడుతూ ఎస్వో, జిల్లా సెక్టోరియల్ అధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆందోళన చేసిన విద్యార్థినులతోపాటు ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారని తెలిపారు. గతంలో ఆదిలాబాద్ రూరల్ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ అయితే హిమబిందును ఏడాదిపాటు విధుల నుంచి తొలగించారని, పనిష్మెంట్‌పై నార్నూర్ పంపిస్తే ఇక్కడ అదే ధోరణి అవలంబిస్తున్నారని తెలిపారు. కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూర్ సంతోష్, రాజ్ గోండు సేవా సమితి మండల అధ్యక్షుడు ఆత్రం పరమేశ్వర్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల కార్యదర్శి అర్క గోవింద్ ఉన్నారు.