
చెన్నూర్ నూతన రెవెన్యూ డివిజన్
గత సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు
నూతన ‘రెవెన్యూ’, మండలాలపై స్పష్టత కరువు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చెన్నూర్‌ను నూతన రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే నియోజకవర్గవాసుల కల నెరవేరడం లేదు. జిల్లాలో ప్రస్తుతం మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్‌లు ఉండగా.. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు చెన్నూర్ నియోజకవర్గ పరిధిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకోసం 2023 అక్టోబర్ 4న కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తూ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాలతోపాటు చెన్నూరు మండలం ఆస్నాద, కోటపల్లి మండలం పారుపల్లిని కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.
స్థానిక రెవెన్యూ అధికారులు ఆ మేరకు సరిహద్దులు, జనాభా, భౌగోళిక వివరాలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ ప్రక్రియ మొదలై రెండేళ్లు పూర్తవుతోంది. కానీ ఇప్పటివరకు ఆ డివిజన్ ఏర్పాటు కాలేదు. దీంతో కొత్త డివిజన్ ఏర్పాటు ఉంటుందా? లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు సైతం ఖరారయ్యాయి. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే మండలాలకు పరిషత్‌ల ఏర్పాటుకు అవకాశం లేకుండా పోనుంది.
దూరభారంతో ఇబ్బందులు
చెన్నూరు నియోజకవర్గం ప్రస్తుతం మంచిర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. దీంతో రెవెన్యూ, పరిపాలన సంబంధించిన పనులకు మంచిర్యాలకు రావాల్సి వస్తోంది. మంచిర్యాల నుంచే భూ సంబంధిత, ఇతర రెవెన్యూ వ్యవహారాలు పర్యవేక్షణ జరుగుతోంది. ఇక కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని పలు గ్రామాలకు మంచిర్యాల దూరభారంగా మారింది. గతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కొత్త డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో చెన్నూరును కొత్తగా ఏర్పాటు చేయాలంటూ స్థానికుల నుంచి డిమాండ్లు వచ్చాయి.
దీంతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో మరుగునపడింది. తర్వాత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపు కరువవడంతో డివిజన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చేర్యాల, ధర్మపురి, వర్దన్నపేట, బోథ్, జడ్చర్ల, ఖానాపూర్, మక్తల్, ఆత్మకూర్ డివిజన్లు ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసింది. అయితే ప్రతిపాదిత చెన్నూరు ఈ జాబితాలో కనిపించలేదు.
ప్రతిపాదిత కొత్త మండలాలు
అస్నాద: అస్నాద, గంగారం, కొమ్మెర, పొక్కూర్, పొన్నారం, సోమన్‌పల్లి, నాగపూర్, బీరెల్లి, సుందరశాల, నర్సక్కపేట, దుగ్నపల్లి
పారుపల్లి: పారుపల్లి, ఆయాపల్లి, పుల్లగా మ, సిర్సా, ఎదుల్లబంధం, లింగన్నపేట, అలుగామ, ఎర్రాయిపేట, బొరంపల్లి, కావర్‌కొత్తపల్లి, అన్నారం, అర్జునగుట్ట, రాజారాం, రాంపూర్, కొల్లూర్, రాపన్‌పల్లి, దేవులవాడ, పిన్నారం, రొయ్యలపల్లి.
మంత్రిపైనే ఆశలు
ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ రాష్ట్రమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో డివిజన్ ఏర్పాటుపై ఆశలు నెలకొన్నాయి. నియోజకవర్గ వాసుల ఏళ్ల నాటి కలను సాకారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.