
బడి నిర్వహణ నిధులొచ్చాయ్
మంచిర్యాలఅర్బన్: ప్రస్తుత విద్యాసంవత్సరం 2025–26కు సంబంధించి బడుల నిర్వహణకు నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ, క్రీడా పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలల(జీరో ఎన్‌రోల్‌మెంటు, పీఎంశ్రీ స్కూళ్లు మినహాయించి)కు కంపోజిట్ స్కూల్ గ్రాంట్లు వచ్చాయి. విద్యాసంవత్సరానికి సంబంధించి చెల్లించాల్సిన నిధులు 50శాతానికి రాష్ట్ర సమగ్ర శిక్షా అధికారులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా బడుల నిర్వహణకు గ్రాంట్లు మంజూరులో జాప్యం వల్ల ప్రధానోపాధ్యాయులకు ఇక్కట్లు తప్పలేదు. మరుగుదొడ్ల శుభ్రతకు కావాల్సిన సామగ్రితోపాటు చాక్‌పీస్‌లు, గదుల శుభ్రతకు కావాల్సిన చీపుర్లు, చిన్నపాటి వసతుల కల్పనకు నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పాఠశాలలకు స్వచ్ఛత కిట్ల కింద ఏడు రకాల వస్తువులు అవసరం ఉంటాయి. బకెట్, రెండు మగ్గులు, సర్ఫ్, బ్రష్‌లు, చీపుర్లు, ఇతరత్రా వస్తువుల కొనుగోలుకు నిధులు మంజూరు చేయకపోవడంతో తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 619 పాఠశాలలకు సంబంధించిన రూ.1,40,20,000 నిధులకు గాను మొదటి విడతలో 50శాతం రూ.70,10,000 మంజూరు చేయడం ఊరట కలిగిస్తోంది.
ఇలా..
ప్రతీ సంవత్సరం పాఠశాలల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక గ్రాంట్లు మంజూరవుతాయి. 1 నుంచి 30 వరకు విద్యార్థులు ఉంటే రూ.10వేలు, 31 నుంచి 100 వరకు రూ.25వేలు, 101 నుంచి 250 లోపు రూ.50వేలు, 251 నుంచి 1000 మంది వరకు రూ.75వేలు, వెయ్యికిపైగా ఉంటే రూ.లక్ష చొప్పున ఇస్తారు. వీటితో మరుగుదొడ్ల శుభ్రతకు అవసరమైన సామగ్రి కొనుగోలు, విద్యుత్, తాగునీరు, చిన్నపాటి మరమ్మతులు, స్టేషనరీ, ప్రయోగ సామగ్రి, సుద్దముక్కలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. జాతీయ పండుగల నిర్వహణ, కంప్యూటర్లు, ప్రొజెక్టర్ల నిర్వహణ, ఇంటర్నెట్, డిజిటల్ తరగతుల వరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
మొదటి దఫా నిధులు(రూ.లలో)
పాఠశాల సంఖ్య రావాల్సినవి మంజూరైనవి
పీఎస్ 415 72,10,000 36,05,000
యూపీఎస్ 89 18,45,000 9,22,500
ఉన్నత 115 49,65,000 24,82,500