
బొమ్మల బడి.. చదువుల ఒడి
మంచిర్యాలఅర్బన్: దివ్యాంగ పిల్లలకు భరోసానిచ్చే భవిత కేంద్రాలను తీర్చిదిద్దుతున్నారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. జిల్లాలో 18 కేంద్రాలుండగా ఐదింటికి పక్కా భవనాలున్నాయి. మిగతావి ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో కొనసాగుతున్నాయి. ర్యాంపులు, రైలింగ్‌తోపాటు మరమ్మతు పనులు, కార్యకలాపాల గది నిర్మాణం, పిల్లలకు అనుకూలమైన అభ్యాస వాతావరణం కోసం పెయింటింగ్ పనుల కోసం జిల్లాకు రూ.37,54,768 నిధులు మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా ఒక్కో కేంద్రానికి పెయింటింగ్ కోసం రూ.1.50లక్షల కేటాయించారు. ఈ నిధులను సద్వినియోగం చేసి కేంద్రాలను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. భవిత కేంద్రాల్లో గీసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
సులువుగా అర్థమయ్యేందుకే..
జిల్లాలోని 18 భవిత కేంద్రాల్లో 196 మంది ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారులున్నారు. 92 మంది ఇంటి వద్ద ఉంటూ సేవలు వినియోగించుకుంటున్నారు. ఒక్కో కేంద్రానికి ఇద్దరు ఐఆర్‌పీల చొప్పున 36 మందికిగాను 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. మానసిక దివ్యాంగులు, చెవిటి, మూగ, అంధత్వం ఇలా 21రకా ల వైకల్యంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థుల ను గుర్తించి సేవలందిస్తున్నారు. ఆటాపాటలతో బోధిస్తే అర్థం చేసుకోవటంతో పాటు ఇట్టే గుర్తు పెట్టుకునే అవకాశముంటుంది. భవిత కేంద్రాల్లో తరగతి గదుల్లో పాఠ్యాంశాలకు అ నుగుణంగా బొమ్మలు గీయిస్తున్నారు. బొమ్మలు చూసే చిన్నారులు వాటిని మననం చేసుకునే వీలుంటుంది. తరగతి గది గోడలపై గీసిన బొమ్మలు వీరిని ఆలోచింపజేస్తున్నాయి. పరిసరాలు అందంగా.. ఆహ్లాదంగా ఉండటమే కాకుండా విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేలా చేస్తున్నాయి. గోడలపై అక్షరాలు, అంకెలు, పలు రకాల చి త్రాలు, మానవ శరీర భాగాలు, వివిధ రకాల ఆకారాలు, బొమ్మలు వారికి కనువిందు చేస్తున్నాయి. పెయింటింగ్ పనులు అన్ని కేంద్రాల్లో పూర్తి కావస్తున్నట్లు, పక్కా భవన నిర్మాణాలు కొనసాగుతున్నట్లు సెక్టోరల్ అధికారి చౌదరి తెలిపారు.
తరగతి గదిలో కూరగాయలు, పండ్ల చిత్రాలు
మంచిర్యాల కేంద్రం వరండా గోడలపై బొమ్మలు

బొమ్మల బడి.. చదువుల ఒడి