
పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పత్తికి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.8,100గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఖరీఫ్ జిల్లాలో లక్షా 61,193 ఎకరాల్లో పత్తి సాగైందని, 13,33,811 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. సీసీఐ నాలుగు, 11 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదించామని అన్నారు. అక్టోబర్ ఒకటి నుంచి 31 వరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతువేదికల్లో పత్తి కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి షాబొద్దీన్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా రవాణా అధికారి సంతోష్‌కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి, పోలీసుశాఖ అధికారి, సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, రైతులు పాల్గొన్నారు.
భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
చెన్నూర్: రెండేళ్లలో జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం చెన్నూర్ గోదావరి నది వద్ద గతంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మహాత్మా జ్యోతిభా పూలే బాలుర గురుకుల పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం, విద్యాబోధన పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో మోహన్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఆర్‌ఐ ఆజీజ్, ఏఈలు పాల్గొన్నారు.