
మంచిర్యాల నగరపాలక సంస్థ కార్యాలయం
బకాయిల కోసం బ్యాంకు ఖాతా ఫ్రీజ్
రూ.30లక్షలు కట్టి పునరుద్ధరణకు బల్దియా తంటాలు
ఆరేళ్లుగా నస్పూర్ పరిధిలో రూ.2.50కోట్లపైనే బాకీలు
తాజాగా నగరపాలక సంస్థ నెత్తిన జరిమానా, వడ్డీల భారం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్లు చేసిన నిర్లక్ష్యం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నెత్తిన ఆర్థిక భారమై పడింది. బకాయిల కింద నగరపాలక సంస్థ బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయింది. మళ్లీ ఖాతా పునరుద్ధరణకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. నస్పూర్ మున్సిపాలిటీలో 128మంది కార్మికులకు అప్పటి కమిషనర్లు సకాలంలో ఈపీఎఫ్(ఉద్యోగ భవిష్య నిధి) చెల్లించలేదు. దీంతో బకాయిలు ఏళ్లుగా పేరుకుపోతున్నాయి. చెల్లించే మొత్తంపై వడ్డీ, జరిమానాలతో బల్దియాకు మరింత ఆర్థిక నష్టంగా మారింది. దీనిపై పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్లు నాలుగేళ్లుగా పలుమార్లు నోటీసులు ఇచ్చారు.
గతేడాది నస్పూర్ మున్సిపాలిటీ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. రూ.5లక్షల వరకు జప్తు చేసుకున్నారు. ఆ తర్వాత మరో బ్యాంకు ఖాతాతో కార్యకలాపాలు సాగించినప్పటికీ సమస్యకు పరిష్కారం వెతకలేదు. ప్రస్తుతం మంచిర్యాల కార్పొరేషన్‌లో విలీనం కావడంతో ఆ మున్సిపాలిటీ ఆస్తులు, అప్పులు, సిబ్బంది తదితరవన్నీ బదిలీ అయ్యాయి. దీంతో రూ.కోట్ల బకాయి కార్పొరేషన్ నెత్తిన పడింది. ఇటీవల బ్యాంక్ ఖాతా స్తంభింపజేయగా, కార్పొరేషన్ నుంచి పీఎఫ్ ఖాతాకు రూ.30లక్షలు చెల్లించారు. మిగతావి కడతామని పీఎఫ్ అధికారులకు తెలియజేశారు.
వేల నుంచి రూ.కోట్లకు చేరి
గత ఆరేళ్లుగా నస్పూర్ సిబ్బంది నెలవారీగా రూ.వేలల్లో ఉండే పీఎఫ్ కట్టడంలో నాటి అధికారులు నిర్లక్ష్యం వహించారు. 2018 నుంచి 2021 వరకు రూ.1.05కోట్లు బకాయిలు ఉన్నట్లు తేలింది. 2021నుంచి 2025వరకు మరో రూ.1.50కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. మొత్తంగా రూ.2.50కోట్లపైనే బకాయి ఉండనుంది. వీటిపై జరిమానా, వడ్డీతో కలిపి ఇంకా రూ.50లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. వీటిలో రూ.14లక్షలు, రూ.5లక్షల వరకు పీఎఫ్ కమిషన్ అధికారులు అకౌంట్లను ఫ్రీజ్ చేసుకుని తీసుకున్నారు.
తాజాగా మరో రూ.30లక్షలు కార్పొరేషన్ చెల్లించింది. మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంది. ఈపీఎఫ్ అనేది ఉద్యోగులకు యాజమాన్యం, ఉద్యోగులు సంయుక్తంగా నెలవారీ జీతంలో 12శాతాన్ని పీఎఫ్ కింద జమ చేయాలి. అయితే నస్పూర్‌లో పని చేసినప్పుడు సిబ్బందికి జీతం మాత్రమే ఇస్తూ పీఎఫ్ వాటా చెల్లించలేదు. కానీ సిబ్బంది నుంచి మాత్రం వారి నెల జీతం నుంచి వాటా తీసుకున్నారు. ఏళ్ల తరబడి కార్మికులకు చెల్లించకపోవడంతో పీఎఫ్ కమిషన్ మున్సిపాలిటీపై విచారణ జరిపి చర్యలు ఉపక్రమించింది.
రికవరీ ఉంటుంది..
నస్పూర్ పరిధి సిబ్బంది పీఎఫ్ బకాయిలపై బాధ్యులను గుర్తించి వారి నుంచి రికవరీ ఉంటుంది. కార్పొరేషన్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తే పునరుద్ధరణకు పీఎఫ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. సిబ్బందికి నెలవారీగా పీఎఫ్ జమలో జాప్యం లేకుండా చర్యలు తీసుకున్నాం. – కె.సంపత్‌కుమార్, కమిషనర్, నగరపాలక సంస్థ
మంచిర్యాల ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి
గత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సిబ్బందికి పీఎఫ్ చెల్లించక, బకాయి, వడ్డీ, జరిమానాలు కట్టాల్సి వస్తోంది. ఆ అధికారులపై చర్యలు తీసుకుని ఇప్పటికై నా సకాలంలో పీఎఫ్ జమ చేయాలి. – నయిం పాషా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మంచిర్యాల
ఆర్థిక భారం
గత అధికారులు చేసిన తప్పిదం ప్రసుత కార్పొరేషన్‌పై ఆర్థిక భారం పడింది. మరోవైపు దీనికి బాధ్యులు ఎవరనేదానిపై విచారణ మొదలైంది. కార్మికుల వివరాలతోపాటు ఆ సమయంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లను బాధ్యులను చేస్తూ వారి నుంచి వసూళ్లు చేసే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్‌లో విలీనమయ్యాక సిబ్బందికి కొత్తగా పీఎఫ్ ఖాతాలు తెరిచి నెలవారీగా జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.