
ఓపీ కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన రోగులు
జీజీహెచ్‌కు పెరిగిన రోగుల తాకిడి
వరద ముప్పుతో ఎంసీహెచ్ తరలింపు
వరండాల్లో మడత మంచాలపై వైద్యం
మంచిర్యాలటౌన్: స్థానిక ఐబీ చౌరస్తాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) రోగులతో కిక్కిరిసిపోతోంది. 250 పడకలతో ఆస్పత్రి నిర్వహిస్తుండగా.. వర్షాకాలంలో ఏటా ముంపు భయంతో మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)ను ఇక్కడికే తరలిస్తుండడంతో నిర్వహణకు అదనంగా 150 పడకలు కేటాయించాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందించేందుకు సరిపడా పడకలు, వార్డుల్లో ఖాళీ లేకపోవడంతో వరండాల్లోనే 200 వరకు మడత మంచాలు వేసి వైద్యం అందిస్తున్నారు. వర్షాకాలం కావడంతో జిల్లాలో సీజనల్ వ్యాధులతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. నిత్యం 300 వరకు ఓపీ ఉండగా ప్రస్తుతం 600కు పైగా వస్తుండడం, 200 మందికి పైగా రోగులు ఇన్‌పేషెంట్‌గా చేరుతున్నారు.
ఏటా తిప్పలే..
మంచిర్యాలలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లోకి వర్షాకాలంలో గోదావరి నది వరద నీరు రావడం, వరద ముప్పు పొంచి ఉండడంతో ప్రతియేటా ఎంసీహెచ్‌లోని గర్భిణులు, బాలింతలను జీజీహెచ్‌కు తరలించాల్సి వస్తోంది. జనరల్ ఆసుపత్రి భవనం పాతది కావడం, వర్షానికి తడిసి స్లాబ్ పెచ్చులు ఊడుతుండడం భయాందోళనకు గురి చేస్తోంది. వరండాల్లోనే పడకలు వేయడంతో వైద్యులు, సిబ్బంది, రోగులు నడిచేందుకు ఇబ్బందిగా మారుతోంది. ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కపోతతోనే రోగులు అవస్థలు పడుతున్నారు. జీజీహెచ్‌లో రెండు ఆపరేషన్ థియేటర్లు ఉండగా ప్రతీరోజు 15కు పైగా ప్రసవాలు, 10కి పైగా వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేస్తుంటారు. ఎంసీహెచ్‌ను ఇక్కడి తరలించడంతో రోగుల సంఖ్య పెరిగి ఆపరేషన్ థియేటర్ వద్ద ప్రసవం, ఇతర శస్త్రచికిత్సకు రోజంతా వేచి చూడాల్సి వస్తోంది. ఎంసీహెచ్‌కు ప్రత్యామ్నాయంగా ఐబీ ఆవరణలో నూతన భవనం నిర్మిస్తున్నా పూర్తయ్యేందుకు మరో రెండేళ్ల సమయం పట్టనుంది. జనరల్ ఆస్పత్రి శిథిలావస్థకు చేరడంతో కాలేజీరోడ్డులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో భవనం నిర్మిస్తుండగా.. పూర్తయ్యేందుకు మరో ఏడాది పట్టనుంది.

ఆస్పత్రి కిక్కిరిసి..