
ఎన్నికల షెడ్యూలే తరువాయి
● తుది ఓటర్ల జాబితా ప్రదర్శన ● ‘పరిషత్’ల్లో 3,76,676 మంది ఓటర్లు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాలను బుధవారం ప్రదర్శించారు. జిల్లా, మండల స్థాయిల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై చర్చించిన విషయం తెలిసిందే. అందరి ఆమోదం మేరకు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జెడ్పీ సీఈఓ గణపతి, డీపీఓ వెంకటేశ్వర్‌రావు పర్యవేక్షణలో జిల్లా, మండల స్థాయి అధికారులు తుది ఓటరు జాబితాను కార్యాలయాల్లో ప్రదర్శించారు. పరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి చేశారు. రిజర్వేషన్లు ఖరారై ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని 16 మండలాల్లో జెడ్పీటీసీ 16, ఎంపీటీసీ స్థానాలు 129 ఉండగా, 713 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 వేల వరకు బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు. మహిళా ఓటర్లు 1,91,015 మంది, పురుష ఓటర్లు 1,85,646 మంది, ఇతర ఓటర్లు 15 మందితో కలిపి మొత్తంగా 3,76,676మంది ఓటర్లు ఉన్నారు.