
‘గిరి’ ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ తనిఖీలు
మంచిర్యాలఅర్బన్: స్థానిక సాయికుంట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 7గంటల వరకు హాస్టల్ నిర్వహణ, లోపాలు, రికార్డుల పరిశీలనలో ఏసీబీ బృందానికి జిల్లా లీగల్ మెట్రాలజీ, సీనియర్ ఆడిటర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ సహకరించారు. సరుకులు, బియ్యం తూకం క్షుణ్ణంగా పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా..? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నీరు, ఆహార నాణ్యత, పరిమాణం, సానిటేషన్ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, పాఠశాల రికార్డులు పరిశీలించారు. వాటర్ ఫ్యూరికేషన్ ట్యాంకు పనిచేయ డం లేదని, సానిటేషన్, వసతిగృహ నిర్వహణ లోపాలను గుర్తించామని, ప్రభుత్వానికి నివేది స్తామని ఆదిలాబాద్ డీఎస్పీ మధు తెలిపారు. కాగా, ఏసీబీ అధికారుల తనిఖీతో ఇతర వసతిగృహ నిర్వాహకులు అప్రమత్తం అయ్యారు.